
భైంసా, వెలుగు: వాగుపైన బ్రిడ్జి కట్టాలని లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్థులు పొలాలకు 14 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. గతంలో వాగు దాటుతూ ఓ రైతు సైతం చనిపోయాడు. ఏండ్లు గడుస్తున్నా సర్కారు స్పందించకపోవడంతో చివరకు ఓ రైతు సొంత ఖర్చులతో తాళ్లు, కర్రలతో బ్రిడ్జి కట్టాడు. నిర్మల్‌జిల్లా కు భైంసా మండలం కత్గాం గ్రామం మీదుగా సుద్దవాగు వెళ్తోంది. ఈ ఊరి రైతులకు వాగు అవతల 800 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. రోజూ పొలం పనులకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
గతేడాది షేక్ బాబు అనే రైతు సుద్దవాగు వాగు దాటుతూ నీట మునిగి చనిపోయాడు. గ్రామానికి చెందిన నాగేశ్‌కు వాగు అవతల 14 ఎకరాల పొలం ఉంది. తనతోపాటు ఊరిలోని రైతుల ఇబ్బందులు చూసిన నాగేశ్తన సొంత ఖర్చు(రూ.25 వేలు)తో తాళ్లు, కర్రల సాయంతో సుద్దవాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేశాడు. ఇటీవల కశ్మీర్వెళ్లిన నాగేశ్అక్కడ చిన్నచిన్న వాగులపై తాళ్లతో ఏర్పాటు చేసిన బ్రిడ్జిలను చూశాడు. తిరిగొచ్చాక ఊర్లోని వాగుపై అదే విధంగా కడితే బాగుంటుందని భావించాడు. వారం రోజులు కష్టపడి తాళ్ల బ్రిడ్జి ఏర్పాటు చేశాడు. గ్రామ సమీపంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని పలుసార్లు ఎమ్మెల్యే, అధికారులను కోరినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు. నాగేశ్చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.