వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీ బకాయిల వసూలుకు డ్రైవ్.

వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీ బకాయిల వసూలుకు డ్రైవ్.
  • రూ.3,700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
  • వెహికల్​ చలాన్ల డ్రైవ్​తో రూ.600 కోట్లు
  • ఇంకోవైపు భూముల అమ్మకం, అప్పులు

హైదరాబాద్​, వెలుగు: డబ్బు సమీకరణపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. వ్యాట్​, సెంట్రల్​ సేల్స్​ ట్యాక్స్​(సీఎస్టీ), జీఎస్టీ పాత బకాయిల వసూళ్లకు సిద్ధమైంది. ఇటీవల ట్రాఫిక్​ చలాన్ల క్లియరెన్స్​కు నెలన్నర పాటు ఆఫర్​ ఇచ్చి రూ.600 కోట్లు వసూలు చేసినట్టే.. పన్ను బకాయిలున్నోళ్లకు వన్​టైం సెటిల్మెంట్​ కింద 2 నెలలు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెల నుంచి అప్లికేషన్​ పెట్టుకునేందుకు అవకాశమివ్వనుంది. అది కూడా అధికారుల తప్పులు, ఏదో ఒక ఇబ్బందితో కట్టకుండా ఉన్న వారికి మాత్రమే ఆఫర్​ను వర్తింపజేసేందుకు యోచిస్తోంది. కావాలని పన్ను ఎగ్గొట్టిన వాళ్ల నుంచి మాత్రం వంద శాతం వసూలు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి 2017 జులై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే, అంతకుముందు అమల్లోఉన్న వ్యాట్​, సీఎస్టీ, ఎంట్రీ ట్యాక్స్​ల బకాయిలు రూ.3,700 కోట్ల వరకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఆఫర్​ ఇవ్వడం ద్వారా బకాయిల్లో కనీసం రూ.2 వేల కోట్లైనా రాబట్టేందుకు సర్కారు టార్గెట్​ పెట్టుకుంది.  
ఎగవేతదారులు 26 వేల మంది 
రాష్ట్రంలో 26 వేల మంది పన్ను ఎగవేసినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో సీఎస్టీ ఎగవేతదారులు 12,680 మంది, వ్యాట్​ ఎగవేతదారులు 11,450 మంది, ఎంట్రీ ట్యాక్స్​ ఎగవేతదారులు 340 మంది, జీఎస్టీ ఎగవేతదారులు 1,538 మంది ఉన్నట్టు ఇటీవల ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ రిపోర్టు ఇచ్చింది. ఇండస్ట్రీస్​, కమర్షియల్​ ఏజెన్సీలు ఎగ్గొట్టిన పన్నుల్లో 50 నుంచి 60 శాతం, వ్యాట్​, సీఎస్టీలకు 40 శాతం వరకు చెల్లించేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రూ.25 లక్షల కన్నా ఎక్కువ బకాయిలున్నోళ్లకు.. ఎలాంటి వడ్డీ లేకుండానే 4 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించాలని యోచిస్తోంది.  
వ్యాట్​లోనే రూ.2,160 కోట్ల బకాయిలు 
మొండి బకాయిల్లో ఎక్కువగా వ్యాట్​ నుంచే రావాల్సి ఉంది. దాదాపు రూ.2160 కోట్లు వ్యాట్​ బకాయిలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత సీఎస్టీ నుంచి రూ.671 కోట్లు, ఎంట్రీ ట్యాక్స్​ బకాయిలు రూ.583 కోట్లు ఉన్నాయి. జీఎస్టీ నుంచి రూ.286 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.