15 వేల ఎకరాల్లో పంట నష్టం.. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం

15 వేల ఎకరాల్లో పంట నష్టం.. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం
  •  బాధిత రైతులు 15,246 మంది 
  • నేడో రేపో అకౌంట్ లోకి డబ్బులు
  • ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 10 వేల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. పోయిన నెలలో కురిసిన వడగండ్ల వానలకు కొన్ని జిల్లాల్లో పంట నష్టం జరగ్గా, దాన్ని లెక్కించేందుకు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. ఏఈవో, ఏవో స్థాయి అధికారులు నేరుగా పంట పొలాల వద్దకు వెళ్లి నష్టం అంచనా వేశారు. 

మొత్తం 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. 15,246 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్టు అందజేశారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం.. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.15.81 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈసీ అనుమతి తీసుకుని, ఒకట్రెండు రోజుల్లో రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంట నష్టంపై సర్వే చేసిన సమయంలోనే వ్యవసాయ శాఖ అధికారులు బాధిత రైతుల ఆధార్‌‌, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సేకరించారు. దీంతో నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే పరిహారం జమ చేయనున్నారు.  

కామారెడ్డిలో ఎక్కువ నష్టం..

అకాల వర్షాలకు ఎక్కువగా కామారెడ్డి జిల్లాలో పంట నష్టం జరిగినట్టు అధికారుల సర్వేలో తేలింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగితే..   అందులో ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. కామారెడ్డి తర్వాత నిజామాబాద్‌‌ జిల్లాలో 1,652 ఎకరాల్లో, సిరిసిల్లలో 1,014 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు.. నిర్మల్‌‌, మంచిర్యాల, కరీంనగర్‌‌ జిల్లాల్లో 500 ఎకరాల లోపు పంటలు దెబ్బతిన్నాయి.

ఇదీ పంట నష్టం లెక్క.. 

జిల్లా    పంట నష్టం    రైతులు    
    (ఎకరాల్లో)    
కామారెడ్డి    10,328.04    9,107    
నిజామాబాద్‌‌    1,652.25    1,809
సిరిసిల్ల    1,014.06    1,036    
సిద్దిపేట    746.30    793    
మెదక్‌‌    714.17    957
ఆదిలాబాద్‌‌    545.09    370    
నిర్మల్‌‌    332.17    519    
మంచిర్యాల    244.01    376    
కరీంనగర్‌‌    160.10    160
సంగారెడ్డి    76.04    119    
 మొత్తం    15,814.03    15,246