ఇంటర్ స్టేట్​ ఇసుకకు గ్రీన్​ సిగ్నల్ .. మైన్స్ అండ్​ జియాలజీ డైరక్టర్​ ఆదేశాలు

ఇంటర్ స్టేట్​ ఇసుకకు గ్రీన్​ సిగ్నల్ .. మైన్స్ అండ్​ జియాలజీ డైరక్టర్​ ఆదేశాలు
  • పక్క రాష్ట్రాల ఇసుకకు ద్వారాలు తెరవడంపై విమర్శల వెల్లువ
  • అక్రమ రవాణాను అరికట్టడానికేనంటున్న అధికారులు 

భద్రాచలం, వెలుగు : పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఇసు తరలించేందుకు సర్కారు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ  మేరకు రాష్ట్ర మైన్స్ అండ్​ జియాలజీ డైరెక్టర్ బీఆర్​వీ సుశీల్​కుమార్​ఈ నెల 3న మెమో రిలీజ్ ​చేశారు. గత ప్రభుత్వం కూడా ఇంటర్ స్టేట్​ ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చి తర్వాత నిలిపేసింది. తాజాగా ఈ నిర్ణయం ప్రకారం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లారీల నుంచి టన్నుకు రూ.200 చొప్పున లారీకి సుమారు రూ.4 వేలు టీఎస్​ఎండీసీ ద్వారా వసూలు చేయనున్నారు.

అయితే తెలంగాణలో కొలువు తీరిన సర్కారు కొత్త ఇసుక పాలసీ లేకపోవడం,  అప్లై చేసుకున్న రీచ్​లకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం, ఓవర్​ లోడ్​నునియంత్రించడం, ఇతర కారణాలతో కొరత ఏర్పడింది. హైదరాబాద్​లో గతంలో లారీ లోడు ఇసుక రూ.50వేలకు దొరికితే ఇప్పుడు అది రూ.90వేలకు పెరిగింది. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి దొడ్డిదారిన ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. దీనిని అరికట్టేందుకు ఈ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

మెమోపై భిన్నభిప్రాయాలు.. 

మైన్​ అండ్​ జియాలజీ డైరెక్టర్ బీఆర్​వీ సుశీల్​కుమార్​ ఉత్తర్వులపై భిన్న అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఇసుక అధికంగా ఉండగా పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు అనుమతిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గోదావరి తీరంలో భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 20 వరకు పాత ఇసుక ర్యాంపులు ఉన్నాయి. వీటిపై అధికారులు తనిఖీల పేరుతో దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఓవర్​ లోడింగ్, బకెట్ విధానానికి స్వస్తి పలకడంతో ఇప్పుడు ర్యాంపులకు బ్రేక్​ పడింది. లారీల రాక తగ్గింది. ఆశించినంత ఇసుక అమ్మే పరిస్థితి లేదు. ఇక కొత్త ఇసుక ర్యాంపులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 11, ములుగు జిల్లాలో 9 అనుమతులు కోసం వేచి చూస్తున్నాయి.

ఇవన్నీ ట్రైబల్​ సొసైటీలవే. వీటికి ఐదు నెలల కింద పర్యావరణ అనుమతుల వచ్చినా అసెంబ్లీ ఎన్నికల కోడ్, కలెక్టర్​ పర్మిషన్​ ఇవ్వడంలో డిలే జరిగింది. దీంతో ఆరు నెలల పర్యావరణ అనుమతులకూ కాలం చెల్లిపోతుంది. మళ్లీ ఈసీ కమిటీలు వచ్చి, వారు అనుమతులు ఇవ్వాలంటే వచ్చే వానాకాలం తర్వాతే ఇసుక ర్యాంపులు తెరుచుకుంటాయి. మాన్​సూన్​ సీజన్​లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాత ర్యాంపుల నుంచి ఇసుకను అమ్ముకునే అవకాశం ఉన్నా..  అపారమైన ఇసుక అందుబాటులో ఉన్నా పక్క రాష్ట్రాల ఇసుకకు ద్వారాలు తెరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ రవాణాను అరికట్టడానికే..

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఇసుక రావడంతో తెలంగాణకు ఆదాయం తగ్గుతుంది. టన్నుకు రూ.200 వసూలు చేస్తే లారీకి రూ.4వేలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.  

 జైసింగ్, ఏడీ మైన్స్