
- జీరో ఎన్ రోల్ మెంట్ ఉన్న స్కూళ్లను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం
- 21 జిల్లాల్లో 34 స్కూళ్లు గుర్తింపు
- వచ్చే నెల 1 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం అనేక అంగన్వాడీ కేంద్రాలు ఒకే గదిలో నడుస్తున్నందున ప్రీ- ప్రైమరీ తరగతులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా జీరో ఎన్ రోల్ మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 21 జిల్లాల్లో 61 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించారు.
అందులో 34 పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్నందున అక్కడికి అంగన్వాడీ కేంద్రాలను మార్చి.. ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని సోమవారం మంత్రి సీతక్క ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు తగ్గట్టుగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన జిల్లా అధికారులకు గైడ్ లైన్స్ జారీ చేశారు. స్కూళ్ల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి, అనువుగా ఉంటే డీఈవోలతో సమన్వయం చేసి భవనాలను అంగన్వాడీ కేంద్రాల కోసం కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 1 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రైవేటు ప్లే స్కూళ్లకు తీసిపోకుండా విద్య: సీతక్క
దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రైవేటు ప్లే స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా అంగన్వాడీలు ఇప్పటికే పిల్లలకు నాణ్యమైన విద్య, సంరక్షణ అందిస్తున్నాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఇప్పుడుఅంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ సామర్థ్యాన్ని పెంచి పిల్లలను ప్రాథమిక విద్యకు సిద్ధం చేస్తున్నాం.
చిన్నారి జీవితంలో ప్రారంభ దశలో ఇచ్చే సరైన సంరక్షణ, విద్య వారికి జీవితాంతం సానుకూల ఫలితాలు ఇస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీల ద్వారా అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం” అని వెల్లడించారు.