సర్కారు సాయం సగం మంది టీచర్లకే

సర్కారు సాయం సగం మంది టీచర్లకే
  • మొత్తం 2,09,873 మంది దరఖాస్తు
  • రూ.2 వేలు అందింది 1,12,843 మందికి
  • యూడైస్​లో పేర్లు చేర్చలేదని నగదు, బియ్యం ఇవ్వలే
  • 84,571 మంది సాయానికి దూరం 
  • మేనేజ్ మెంట్ల తప్పు, అధికారుల నిర్లక్ష్యమే కారణం
  • తమనూ ఆదుకోవాలని ప్రైవేటు టీచర్లు, సిబ్బంది వేడుకోలు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు టీచర్లలో దాదాపు సగం మందికి సర్కారు సాయం అందలేదు. దరఖాస్తు చేసిన 2.09 లక్షల మందిలో.. 1,12,843 మందికి మాత్రమే నగదు బదిలీ జరిగింది. దాదాపు 84,571 మంది ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని సర్కారు పట్టించుకోలేదు. అధికారిక యూడైస్ లో వీళ్ల పేర్లను యాజమాన్యాలు చేర్చలేదన్న కారణంతో సాయం చేయలేదు. ప్రైవేటు స్కూల్ మేనేజ్ మెంట్లు చేసిన తప్పుకు, ఆఫీసర్ల నిర్లక్ష్యానికి తాము బలి అవుతున్నామని, సర్కారు గుర్తించి తమకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు.

అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయని..
కరోనాతో విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బందికి బడులు స్టార్ట్ అయ్యేదాకా ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టీచర్లంతా మేనేజ్ మెంట్ల ద్వారా అప్లై చేశారు. ప్రభుత్వం 1.45 లక్షల మంది దాకా ఉంటారని అంచనా వేస్తే, ఏకంగా 2,09,873 అప్లికేషన్లు వచ్చాయి. అదీ ప్రీప్రైమరీ స్కూళ్ల టీచర్లను, ఎయిడెడ్ స్కూళ్లలో కొనసాగుతున్న అన్​ఎయిడెడ్ సెక్షన్లలో పనిచేస్తున్న టీచర్లను, స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్లు, ఆయాలను మినహాయిస్తేనే. ఈ వివరాలు చూసి కంగుతున్న విద్యాశాఖ.. యూడైస్​ లెక్కల ప్రకారమే ఇస్తామని ప్రకటించింది. అప్పటిదాకా యూడైస్​ గురించి పెద్దగా పట్టించుకోని యాజమాన్యాల బండారం బయటపడింది. దరఖాస్తు చేసిన 2.09 లక్షల మందిలో యూడైస్​లో పేర్లున్నది 1.25 లక్షల మందివే. ఇందులో ప్రస్తుతం1,12,843 మందికి మంగళవారం రాత్రి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున నగదు బదిలీ చేశారు. మిగిలిన కొద్దిమంది బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఇవ్వడంతో ఆగిపోయాయి. ఒకటీ రెండు రోజుల్లో వారికీ నగదు అందనుంది. యూడైస్​లో పేర్లు లేని 84,571 మందికి సాయం అందలేదు. గతేడాది మార్చి నుంచి బడులు బంద్ కాగా, చాలా స్కూల్ మేనేజ్ మెంట్లు టీచర్లు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. దీంతో అనేక మంది కూలిపనులు చేసుకుని కుటుంబాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం సర్కారు సాయం కూడా అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 

అప్పుడు పట్టించుకోకుండా...
ఏటా టీచర్ల వివరాలను యూడైస్​తో పాటు టీచర్ ఇన్​ఫో ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్ సేకరిస్తోంది. వివరాలు అప్​డేట్ చేయాల్సిన బాధ్యత మేనేజ్ మెంట్లదే. కానీ యూడైస్​, టీచర్​ఇన్​ఫోలో ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్లు ఏ సమాచారం ఇస్తే, దాన్నే అధికారులు గుడ్డిగా ఫైనల్ చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో 40 నుంచి 60 మంది టీచర్లున్నా కేవలం ముగ్గురు, నలుగురు పేర్లనే ఎంట్రీ చేశాయి. వచ్చిన సమాచారమే చాలులే అన్నట్టు ఆఫీసర్లు కూడా తయారయ్యారు. తప్పుడు వివరాలు ఇచ్చిన మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకుని, దరఖాస్తు చేసుకున్న అందరికీ నగదు, బియ్యం ఇవ్వాలని వారంతా వేడుకుంటున్నారు. 

తప్పు మాదా?
25 ఏండ్లుగా పీఈటీగా పని చేస్తున్న. ఏడాదిగా స్కూళ్లు లేకపోవడంతో జీతాలివ్వలేదు. టీ దుకాణం పెట్టుకొని బతుకుతున్న. ప్రభుత్వం ఇచ్చే సాయం కొంతైనా ఆసరాగా ఉంటుందని భావించా. కానీ నాకు అందలేదు. ఎంఈఓను అడిగితే యూడైస్​లో పేరు లేకుంటే రాదని చెప్పారు. మేనేజ్మెంట్ పంపకుంటే తప్పు మాదా సార్.?, మాకు నగదు, బియ్యం ఇవ్వాలి. 
‑ పాపారావు, భరత్ నగర్​, హైదరాబాద్