దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి కలేనా?

దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి కలేనా?

ఉప్పునుంతల, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా ఉప్పునుంతల-, వంగూర్ మండలాల సరిహద్దులో దుందిభి నదిపై మొలగర, ఉల్పర గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే స్థానంలో హై లెవల్​ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్​ను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. 15 ఏండ్ల కింద నిర్మించిన సీసీ కాజ్​వే భారీ వరదలతో ధ్వంసమైంది. ఏడేండ్లుగా పాలకులు పట్టించుకోకపోవడంతో రాకపోకలకు అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు గత ఏడాది ఉల్పర సర్పంచ్  శ్రీజ రామకృష్ణారెడ్డి రూ.3 లక్షల తమ సొంత డబ్బులతో రిపేర్లు చేయించారు. అయితే వరదలతో కొట్టుకుపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 
 

హై లెవల్  బ్రిడ్జి నిర్మించట్లే..​ 

వరద ఉధృతిని తట్టుకునేలా దుందుభి నదిపై హై లెవల్​ బ్రిడ్జి నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. హై లెవల్​ బ్రిడ్జి మంజూరవుతుందని భావిస్తుండగా, రూ.84 లక్షలతో కాజ్​వే నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల, లింగాల, బలమూర్  మండలాలకు చెందిన ప్రజలు ఈ బ్రిడ్జి మీదుగానే కల్వకుర్తి, హైదరాబాద్  తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తారు. ఈ సమస్య పరిష్కరించాలని పలుమార్లు ఎమ్మెల్యే గువ్వల బలరాజు దృష్టికి తీసుకెళ్లగా, హై లెవెల్  బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఈ హామీ నెరవేరలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.