పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు..అక్టోబర్ 12 నుంచి మొదలు కానున్న కొనుగోళ్లు

పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు..అక్టోబర్ 12 నుంచి మొదలు కానున్న కొనుగోళ్లు
  •     ఉమ్మడి నల్గొండ జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు 
  •     గత ఏడాదితో పోల్చితే తగ్గిన దిగుబడి 
  •     మద్దతు ధరపై రైతుల అసంతృప్తి..  ధర పెంచాలని డిమాండ్ చేస్తున్న రైతులు

నల్గొండ, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు ఈ నెల 12  నుంచి మొత్తం 30  కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను గుర్తించిన మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను తెరిచేలా చర్యలు చేపట్టారు. 

స్లాట్ బుకింగ్ విధానంతో  కొనుగోళ్లు 

సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన ‘కపాస్ కిసాన్‌ యాప్ ’ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో తొలుత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.  నచ్చిన మిల్లు, నచ్చిన సమయానికి పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోలుకు అనుమతిస్తారు. దీని ద్వారా మిల్లుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

వ్యవసాయశాఖ అధికారుల సహకారంతోనైనా, రైతులు స్వయంగానైనా ఆన్‌లైన్  స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  ఈ యాప్ వల్ల రైతులు రోజుల తరబడి కాకుండా నిర్దేశిత సమయానికి కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకెళ్లి విక్రయించవచ్చు. నిర్దేశించిన రోజు పత్తి తీసుకెళ్లనట్లయితే స్లాట్ రద్దువుతుంది. అంతేకాకుండా నిజమైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకునే అవకాశం ఉంటుంది.

దిగుబడిపై ప్రభావం

నల్గొండ జిల్లాలో ఈ ఏడాది 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు.  సుమారు 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. గతేడాది 24 సీసీఐ కేంద్రాల ద్వారా సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు.  సూర్యాపేట జిల్లాలో 90  వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు.

 ఎకరాకు సగటున ఎనిమిది క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, మొత్తంగా 7.20 లక్షల  క్వింటాళ్ల దిగుబడి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఆరు జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు చేయనున్నారు. అయితే ఈ సారి అకాల  వర్షాలతో పత్తి దిగుబడి పై ప్రభావం చూపిండాని రైతులు ఆవేదన చెందుతున్నారు.  

పెరిగిన సాగు ఖర్చులు

పత్తి పంట చేతికి వచ్చే దాకా ఎకరాకు సగటున రూ.40వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా అన్ని ఖర్చులు పోను రూ.20 వేల చొప్పున మిగులుతుందని చెబుతున్నారు. ఈ సంవత్సరం అతివృష్టితోపాటు యూరియా సకాలంలో అందక దిగుబడిపై ప్రభావం చూపునుందనే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి.  ఎకరాకు గరిష్టంగా నాలుగు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, సాగు ఖర్చులు కూడా గిట్టుబాటు కావని అన్నదాతలు వాపోతున్నారు.

మద్దతు ధరపై అసంతృప్తి 

ఈ ఏడాది పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించారు.  గత ఏడాది క్వింటాలు పత్తి మద్దతు ధర రూ.7,521 ఉండగా, ఈ సంవత్సరం రూ.589 ఎక్కువగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సీసీఐలో అమ్ముకుంటే  కష్టమే మిగులుతుందని,  ప్రైవేటును ఆశ్రయించడమే మేలనే ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.  సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉండటంతో గిట్టుబాటు ధర కోసం రైతులు వేచి ఉండే అవకాశాలు ఉన్నాయి.