ధాన్యం కొనుగోళ్లకు పక్కా ప్లాన్.. 75 లక్షల టన్నుల ధాన్యం టార్గెట్.. 11.63 కోట్ల గన్నీ బ్యాగులు రెడీ

ధాన్యం కొనుగోళ్లకు  పక్కా ప్లాన్.. 75 లక్షల టన్నుల ధాన్యం టార్గెట్.. 11.63 కోట్ల గన్నీ బ్యాగులు రెడీ
  • మరో 7.12 కోట్ల గన్నీ బ్యాగులకు ఆర్డర్
  • లారీల కొరత తీర్చేలా యాజమాన్యాలతో ముందస్తు ఒప్పందాలు
  • గతంలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ శాఖ ముందస్తు చర్యలు

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం పక్కా ప్లాన్ తో సిద్ధమవుతోంది. గతంలో తలెత్తిన ఇబ్బందులు ఈసారి పునరావృతం కాకుండా ధాన్యం కొనుగోళ్లకు సివిల్‌‌  సప్లయ్స్‌‌  శాఖ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఈసారి 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణను టార్గెట్ గా పెట్టుకుని అక్టోబర్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. గన్నీ బ్యాగులను సిద్ధం చేయడంతో పాటు సెంటర్లలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు, వెదర్ ఫోర్​ కాస్ట్  వంటి ఆధునిక సౌకర్యాలతో రైతులకు సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 

ధాన్యం సేకరణకు కీలకమైన గన్నీ బ్యాగుల సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు మొత్తం 18.75 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు.  ఇప్పటికే 11.63 కోట్ల బ్యాగులను అధికారులు సిద్ధం చేశారు. మరో 7.12 కోట్ల బ్యాగులకు ఆర్డర్  ఇవ్వనున్నారు. ఈ గన్నీబ్యాగుల్లో  10.12 కోట్ల కొత్త గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించగా, ఇందులో 7 కోట్లు గన్నీ బ్యాగుల సేకరణ పూర్తి చేశారు. మిగతా 3.12 కోట్ల గన్నీ బ్యాగులను త్వరలో సమకూర్చుకోనున్నారు. ఈ సీజన్​లో పాత గన్నీ బ్యాగులు 8.63 కోట్లు ఉపయోగించనున్నారు.

సెంటర్లలో వడ్లు తడవకుండా సెంటర్ల వారీగా వెదర్ ఫోర్​కాస్ట్​
అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు సివిల్  సప్లయ్స్  శాఖ వర్షం అంచనా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. కొనుగోలు సెంటర్లకు వచ్చిన వడ్లు తడవకుండా సెంటర్లవారీగా వెదర్  ఫోర్ కాస్ట్  ద్వారా హెచ్చరికలు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల వరకు ఆ సెంటర్​లో వర్షం వచ్చే అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం అందిస్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు సెంటర్లు.. ఆధునిక సౌకర్యాలు
వానాకాలం వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 4,252 ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), 3522 ఐకేపీ సెంటర్లు, 558 ఇతర కేంద్రాలు ఉన్నాయి. ప్రతి సెంటర్ లో టార్పాలిన్లు, ఆటోమేటిక్  డ్రైయర్లు, క్లీనర్లు, గ్రెయిన్  కాలిపర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు, తాలు తొలగింపు యంత్రాలు వంటి ఆధునిక పరికరాలను  అందుబాటులో ఉంచుతున్నారు. అక్టోబర్  మొదటి వారం నుంచి నిజామాబాద్  జిల్లాలో ప్రారంభమై, దశలవారీగా మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు చేపడతారు. నిజామాబాద్ లో అత్యధికంగా 6.80 లక్షల టన్నులు, జగిత్యాలలో 5 లక్షల టన్నులు, నల్గొండలో 4.76 లక్షల టన్నులు ధాన్యం సేకరణ టార్గెట్ గా పెట్టుకున్నారు.

లారీల కొరత లేదు
ఏటా ధాన్యం రవాణాలో లారీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లారీల కొరత సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని అలాంటి సమస్యలు రాకుండా జిల్లా రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసి, లారీల యజమానులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. జిల్లా రవాణా శాఖలను రంగంలోకి దింపి, సమయానికి రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. 

బ్యాంక్  గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే కేటాయింపు
బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు చేస్తారు. రైతులు మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సెంటర్ల వద్దనే ధాన్యం అప్పగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ట్రక్  షీట్  ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్ముకున్న తరువాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు. ధాన్యం మిల్లులకు తరలించే బాధ్యతతో పాటు మిల్లుల్లో ధాన్యం దింపడం వరకూ రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు.

సరిహద్దు జిల్లాల్లో 56 చెక్​పోస్టులు..అక్రమ వడ్ల రవాణా అరికట్టకు..
సన్న వడ్లకు బోనస్  ఇస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ వడ్ల రాకను అరికట్టేందుకు 17 జిల్లాల్లో 56 ఇంటర్ -స్టేట్ చెక్​పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్​పోస్టుల్లో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నరు. అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, పోలీసు శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

దేశంలోనే తొలిసారి ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్లు, క్లీనర్లు
దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో ఆటోమేటిక్  ప్యాడీ డ్రైయర్లు, క్లీనర్లను సివిల్​ సప్లయ్స్​ శాఖ ప్రవేశపెట్టింది. డ్రైయర్లు ధాన్యంలో అధిక తేమ శాతాన్ని తగ్గించి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ధాన్యంలో ఎలాంటి  నష్టం జరుగకుండా నివారిస్తాయి. అలాగే, క్లీనర్లు వాక్యూమ్  సక్షన్  ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచి తేమను 2 శాతం వరకు తగ్గిస్తాయి. అంతేకాకుండా కూలీల అవసరాన్ని కూడా తగ్గిస్తాయి. ప్రస్తుతం 977 ప్యాడీ క్లీనర్లు సిద్ధంగా ఉండగా, మరో 2649 అదనంగా సమకూర్చుకోనున్నారు.