ఎంఎస్పీతో పాటు బోనస్..ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు భారీగా సన్నాల తరలింపు

ఎంఎస్పీతో పాటు బోనస్..ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు భారీగా సన్నాల తరలింపు
  • వారంలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ ​
  • సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

నిజామాబాద్, వెలుగు :  కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి వానాకాలం సీజన్​ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సన్న, సాధారణ రకాలకు మద్దతు ధర అందజేస్తూ రైతులకు భరోసా కల్పిస్తోంది. సన్న వడ్లకు మద్దతు ధరతోపాటు బోనస్​ అందజేస్తుంది. ఈసారి అధిక వర్షాలు కురువడం వల్ల దిగుబడి తగ్గింది. దీంతో ఆందోళనలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం అందించే బోనస్​కొంతమేర ఆదుకుంటోంది.  

తడిసిన వడ్లను సైతం కొంటామని ప్రభుత్వం ప్రకటించడంతో సెంటర్లలో కాంటా వేయడంలో జాప్యం జరగకుండా చూస్తున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరతతో పాటు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని ఉన్నతాధికారులు నిర్వాహకులకు ఆదేశాలిచ్చారు. వర్షాలకు వడ్లు తడువకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.  

చకచకా బిల్లులు..

జిల్లాలో వానాకాలం సీజన్​కు సంబంధించి 4.27 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల 28,131 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జరిగిన నష్టం పోగా 12.5 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. విత్తనాలు, తినేందుకు ఉంచుకునే వడ్లు పోను  9 లక్షల టన్నుల వడ్లు వస్తాయన్న అంచనాతో ప్రభుత్వం 704 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది.  ఇందులో 7.5 లక్షల టన్నులు సన్న వడ్లు ఉంటాయని అంచనా వేయగా, వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. 

ఏటా ఎకరాకు 40 బస్తాలు పండే సన్న వడ్లు ఈసారి 32 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాకముందు సుమారు లక్ష టన్నుల పచ్చి వడ్లను మిల్లర్లకు అమ్మారు. దసరా పండగ నుంచి ప్రభుత్వ సెంటర్లకు వడ్లు వస్తున్నాయి.  ఇప్పటి వరకు 354 సెంటర్ల ద్వారా 1.56 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, అందులో సన్న వడ్లు 1.48 లక్షల టన్నులు ఉన్నాయి. 

 ‘ఏ’ గ్రేడ్​ రకం క్వింటాల్​కు రూ.2,389, సాధారణ రకం క్వింటాల్​కు రూ. 2,369 ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తోంది. శనివారానికి  రూ.239 కోట్ల పేమెంట్ జరిగింది. సన్నాలకు అదనంగా క్వింటాల్​కు రూ.500 చొప్పున ఇప్పటి వరకు రూ.45 లక్షలు బోనస్​ చెల్లించారు. సివిల్​ సప్లయ్​శాఖ అన్నదాతల వివరాలు గవర్నమెంట్​కు అప్ లోడ్ చేయగానే బోనస్​ రిలీజ్ చేస్తోంది. రైతులు సన్న వడ్లను ప్రభుత్వ సెంటర్లకే తీసుకొచ్చేలా ఆఫీసర్లు అరెంజ్​మెంట్లు చేస్తున్నారు. 

బోనస్​తో రైతుకు లాభం 

ఎంఎస్​పీతో పాటు సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నాం. వారం రోజుల తేడాతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. మున్ముందు సర్కార్​ కేంద్రాలకు సన్న వడ్లు అధికంగా రానున్నాయి.   అకాల వర్షానికి తడిసిన 26 వేల వడ్ల బ్యాగ్​లను మిల్లుల్లో అన్​లోడ్ చేయించాం. రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీకాంత్​రెడ్డి, డీఎం, సివిల్ సప్లయ్​