మా స్థలం లాక్కొంటున్నారు... న్యాయం చేయండి

మా స్థలం లాక్కొంటున్నారు... న్యాయం చేయండి

రంగారెడ్డి జిల్లా : తమ స్థలాన్ని అధికారులు లాక్కుంటున్నారని, తమకు న్యాయం చేయాలని శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ తండాలో ఓ కుటుంబం వేడుకుంటోంది. తమ పూర్వీకుల కాలంనాటి స్థలంలో అధికారులు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతోంది. 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద షాపూర్ తండా గ్రామంలో సర్వేనెంబర్ 220/9లో మూడు ఎకరాల స్థలంలో 30 గుంటల స్థలాన్ని ప్రభుత్వ అధికారులు తమ వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బలవంతంగా లాక్కుంటున్నారని పట్టాదార్ సభావట్ పుర్యా అనే వ్యక్తి తెలిపాడు. తమ తాతల కాలం నాటి నుండి 3 ఎకరాల స్థలంలో వ్యవసాయం చేస్తున్నామని చెప్పాడు. అధికారులు తమ స్థలంలోకి వచ్చి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాడు. తమ గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉండగా ప్రభుత్వాధికారులు బలవంతంగా తమ స్థలాన్ని లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

ఇదే అంశంపై శంషాబాద్ మండలం తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. సర్వే 220/9 లో POT స్థలం ఉందని తెలిపారు. గతంలో పూర్య అనే పట్టాదారు తన స్థలాన్ని విక్రయించాడని, అదే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామ ప్రజలకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం POT కింద తీసుకున్న తర్వాత తాము కబ్జా మీద ఉన్నామని పూర్య కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని ఆరోపించారు. పూర్య అమ్మిన స్థలాన్ని రెస్యూమ్ చేసుకొని POT కింద తీసుకున్నామని, 30 గుంటల స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.