దిక్కులేని తెలుగు వర్సిటీ

దిక్కులేని తెలుగు వర్సిటీ
  • ప్రొఫెసర్లు లేక విభాగాలన్నీ ఖాళీ
  • 60 టీచింగ్‌‌ పోస్టులకు ఉన్నది 24 మందే..
  • ఐదేళ్లయినా పూర్తికాని విభజన..
  • నత్తనడకన సాగుతున్న బాచుపల్లి క్యాంపస్‌‌ నిర్మాణం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  తెలుగు భాష, సంస్కృతి, కళలకు వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో స్థాపించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాభవం కోల్పోతోంది. టీచింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ ఫ్యాకల్టీ కొరత, నిధుల కొరతతో వర్సిటీ అనుబంధ కాలేజీలు నామమాత్రంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు కళలు, కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిత్యం కళకళలాడిన విభాగాలు ఇప్పుడు కళావిహీనం కావడం సాహితీవేత్తలను, విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. భాషాభిమానం చాటేందుకు రెండేళ్ల కింద హైదరాబాద్‌‌‌‌లో కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన సర్కారు.. అసెంబ్లీ పక్కనే ఉన్న తెలుగు వర్సిటీని పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఐదు పీఠాలు.. 13 శాఖలు

1985 జనవరి 1న హైదరాబాద్‌‌‌‌లో అప్పటి సీఎం ఎన్టీఆర్​ తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా వర్సిటీలో సాహిత్య పీఠం, వరంగల్‌‌‌‌లో జానపద విజ్ఞాన పీఠం, కూచిపూడిలో కూచిపూడి నాట్య విభాగం, శ్రీశైలంలో పురావస్తు పరిశోధన విభాగం, రాజమండ్రి శివారులోని బొమ్మూరులో తెలుగు సాహిత్య పీఠంను స్థాపించారు. ఈ పీఠాలు ఆయా రంగాల్లో విశేష పరిశోధనలు చేస్తున్నాయి. వర్సిటీ పరిధిలో 13 విభాగాలు.. నిఘంటు నిర్మాణం, భాషా శాస్త్రం (లింగ్విస్టిక్స్‌‌‌‌), సంగీతం (మ్యూజిక్‌‌‌‌), నృత్యం (డ్యాన్స్‌‌‌‌), రంగస్థల కళలు (థియేటర్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌), జానపద కళలు (ఫోక్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌), శిల్పం,-చిత్రలేఖనం, తెలుగు సాహిత్యం, సంస్కృతి, పర్యాటకం, కమ్యూనికేషన్, జర్నలిజం, జ్యోతిష్యం,-వాస్తు, జానపద విజ్ఞాన అధ్యయనం, గిరిజన అధ్యయన శాఖలు ఉన్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత కొరత

తెలుగు వర్సిటీలో టీచింగ్, నాన్​ టీచింగ్​ సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది. మొత్తం 60 టీచింగ్‌‌‌‌ పోస్టులకు ఇప్పుడున్నది 24 మందే. ఇందులో ముగ్గురు త్వరలో రిటైర్​ కానున్నారు. ఖాళీల సంఖ్య 39కి చేరుతుంది. అంటే ఒక్కో డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఒక రెగ్యులర్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ కూడా ఉండని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రిటైర్డ్‌‌‌‌  ప్రొఫెసర్లు, గెస్ట్‌‌‌‌  లెక్చరర్లతో పాఠాలు బోధిస్తున్నారు. వివిధ విభాగాల్లో చాలా ఏళ్లుగా తాత్కాలిక ఇన్‌‌‌‌స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న 40 మందికి టీచింగ్‌‌‌‌ ఫ్యాక్టల్టీకి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. వర్సిటీలో మొత్తం 208 నాన్‌‌‌‌  టీచింగ్‌‌‌‌ పోస్టులకుగాను 137 మందే ఉన్నారు.

జీతాలకూ కటకటనే

వర్సిటీ పరిధిలో పనిచేస్తున్న టీచింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టీచింగ్ స్టాఫ్‌‌‌‌కు వేతనాల చెల్లింపు నెలనెలా ఇబ్బందికరంగానే ఉంది. రెండేళ్ల క్రితం రిటైరైన ప్రొఫెసర్లు, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ సిబ్బందికి ఇప్పటికీ రిటైర్మెంట్‌‌‌‌  బెనిఫిట్స్‌‌‌‌ అందలేదు. వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేకపోవడం, డిస్టెన్స్‌‌‌‌  ఎడ్యుకేషన్‌‌‌‌  సెంటర్‌‌‌‌కు  పర్మిషన్‌‌‌‌ రాక అడ్మిషన్లు కల్పించకపోవడంతో ఆదాయం వచ్చే ఇతర మార్గాలూ లేకుండా పోయాయి.
యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌లోని ఆడిటోరియంను ఎవరైనా అద్దెకు తీసుకుంటే వచ్చే డబ్బులే ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి అదనపు ఆదాయంగా సమకూరుతున్నాయి.

దూరవిద్య కోర్సులకు బ్రేక్‌‌‌‌

తెలుగు వర్సిటీ దూరవిద్య కోర్సులకు యూజీసీ అనుబంధ డిస్టెన్స్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ బోర్డు (డెబ్‌‌‌‌) గుర్తింపు అప్​డేట్​ కాక అధికారులు గత ఏడాది నుంచి నోటిఫికేషన్లు జారీ చేయలేదు. కోర్సుల సమాచారం, నిర్వహణపై గతంలో డిస్టెన్స్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌  డైరెక్టర్‌‌‌‌  ఢిల్లీలోని డెబ్‌‌‌‌ అధికారుల ఎదుట ప్రజెంటేషన్‌‌‌‌ ఇచ్చినా గుర్తింపు ఇవ్వలేదు. న్యాక్‌‌‌‌ ‘ఏ’ గ్రేడ్‌‌‌‌ ఉన్న వర్సిటీలే దూరవిద్య కోర్సులు నిర్వహించాలన్న నిబంధన దీనికి కారణమని తెలిసింది. డిస్టెన్స్​ కోర్సుల నిర్వహణ ఆగిపోవడంతో వర్సిటీ ఏటా రూ.2 కోట్ల ఆదాయం కోల్పోతున్నట్టు అధికారులు చెప్తున్నరు.

ఎక్కడి పనులు అక్కడే

హైదరాబాద్‌‌‌‌ లోని బాచుపల్లిలో నిర్మిస్తున్న వర్సిటీ క్యాంపస్‌‌‌‌  పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడి హాస్టల్‌‌‌‌  విద్యార్థులకు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో రోజూ వాటర్‌‌‌‌ క్యాన్లను కొంటున్నారు. నాంపల్లిలోని యూనివర్సిటీ ఆవరణలో సుమారు రూ.3 కోట్లతో పరిపాలన భవనం, ఓపెన్‌‌‌‌ ఆడిటోరియం పనులు చేపట్టినా.. నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. రూ.25 లక్షలతో నిర్మించిన లాంగ్వేజ్‌‌‌‌  ల్యాబ్‌‌‌‌ ఇప్పటికీ ప్రారంభించలేదు.

న్యాక్‌‌‌‌  ‘బీగుర్తింపుతో సరి

వర్సిటీకి గతంలో వచ్చిన న్యాక్‌‌‌‌ గుర్తింపు గడువు పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు మళ్లీ తనిఖీ చేశారు. యూజీసీ నుంచి నిధులు దక్కించుకోవాలంటే న్యాక్‌‌‌‌ గుర్తింపు తప్పనిసరి. దాంతో అధ్యాపకులు, ఉద్యోగులు మూడు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నిధులతోనే కొన్ని పనులను పూర్తి చేశారు. మూడు రోజులు వర్సిటీ పరిధిలో పర్యటించి వెళ్లిన న్యాక్‌‌‌‌ బృందం ఇటీవలే ‘బీ’ గ్రేడ్‌‌‌‌ను ప్రకటించింది.

పరిశోధన, ప్రచురణలను ప్రోత్సహించాలి

తెలుగు యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలతో పోల్చిచూస్తే విభిన్నమైనది. సంస్కృతి, సంప్రదాయాలు, కళల పరిరక్షణ, వాటిపై పరిశోధన కోసమే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పుస్తకాల్లో చదివి పరీక్షలు రాసేలా ఈ యూనివర్సిటీ కోర్సులు ఉండవు. ఇందులోని కోర్సులన్నింటికీ ఫ్యాకల్టీ తప్పనిసరి. అందువల్ల ఖాళీగా ఉన్న టీచింగ్‌‌‌‌ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలి. స్పెషల్‌‌‌‌  గ్రాంట్‌‌‌‌  ఇచ్చి రిటైర్డ్‌‌‌‌  ఉద్యోగులకు బెనిఫిట్స్‌‌‌‌  అందజేయాలి.

– ప్రొఫెసర్‌‌‌‌  నిరీక్షణ్‌‌‌‌ బాబు, జనరల్‌‌‌‌ సెక్రటరీ, తెలుగు వర్సిటీ అకడమిక్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌