రెన్యువల్​ చేస్తలేరు.. జీతం ఇస్తలేరు

రెన్యువల్​ చేస్తలేరు.. జీతం ఇస్తలేరు
  • ఇబ్బందుల్లో మోడల్​ స్కూల్​ వొకేషనల్ టీచర్లు
  • నడవని ఆన్‌లైన్ క్లాసులు.. పట్టించుకోని సర్కార్

మెదక్, వెలుగు: మోడల్ స్కూళ్లలో పని చేసే వొకేషనల్ టీచర్లు, కోఆర్డినేటర్లు పని లేక.. జీతం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మోడల్ స్కూల్స్ తెరవలేదు. దీంతో వొకేషనల్ ​టీచర్లను సర్కారు రెన్యువల్​చేయలేదు. అకడమిక్ స్టూడెంట్స్ కు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుండడంతో సంబధిత టీచర్స్ డ్యూటీ చేస్తున్నారు. వారికి జీతాలు వస్తున్నాయి. కానీ వొకేషనల్ కోర్సులకు సంబంధించి ఎలాంటి క్లాసులు నిర్వహించడం లేదు. దీంతో టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 14 నెలలుగా డ్యూటీ లేక, జీతాలు రాక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

12 రకాల కోర్సులు 
రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో కలిపి మొత్తం 194 మోడల్​ స్కూల్స్​ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్​వరకు బోధిస్తున్నారు. 2016 నుంచి వొకేషనల్​ (వృత్తి విద్యా) కోర్సులను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 9,10, ఇంటర్​ఫస్ట్​, సెకండ్​ఇయర్​ స్టూడెంట్స్​కు వొకేషనల్​కోర్సుల్లో ట్రైనింగ్​ఇస్తున్నారు. మీడియా అండ్ ఎంటర్​టైన్​మెంట్, రిటైల్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్, అపరల్ అండ్ మేడ్ అప్స్, మైనర్ ఇరిగేషన్, హెల్త్ కేర్, బ్యూటీషియన్, అగ్రికల్చర్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి 12 రకాల కోర్సులు ప్రవేశ పెట్టారు. ప్రతి మోడల్​స్కూల్​లో 2 రకాల కోర్సుల అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రంగాల్లో ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు 388  మంది వొకేషనల్​టీచర్లుగా చేరారు. వారికి నెలకు రూ. 20 వేల జీతం ఇచ్చారు. 2016 నుంచి గతేడాది మార్చి వరకు మోడల్​స్కూల్స్​లో వొకేషనల్​కోర్సులు నడిచాయి. కరోనాతో ప్రభుత్వం లాక్​డౌన్​విధించడంతో గతేడాది ఏప్రిల్​నుంచి స్కూళ్లు బందయ్యాయి. దాంతో వారిని రెన్యువల్​చేయలేదు. గతేడాది లాక్​డౌన్​ఎత్తేసిన తర్వాత ఇతర సబ్జెక్టులకు సంబంధించి ఆన్​లైన్​క్లాసులు ప్రారంభించారు. కానీ వొకేషనల్ టీచర్లకు మాత్రం పోయినసారి, ఈసారి ఆన్​లైన్​ క్లాసులకు అవకాశం ఇవ్వకపోవడంతో వారు ఖాళీగానే ఉంటున్నారు. ​జీతం రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. 

ఎవరూ పట్టించుకోవట్లేదు
స్టూడెంట్స్​కు ఆన్​లైన్​లో క్లాస్​లు బోధించేందుకు మేం రెడీగా ఉన్నాం. అందుకు పర్మిషన్ ఇవ్వాలని, రెన్యువల్​ చేసి జీతాలివ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎస్ఎస్ఏ స్పెషల్​ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ దేవసేన, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి పలుసార్లు వినతిపత్రాలు సమర్పించాం. ఇతర టీచర్ల మాదిరిగానే మాకూ అవకాశం కల్పించాలని విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 
– రఘుమోహన్, వొకేషనల్ టీచర్స్​అసోసియేషన్,​ మెదక్​ జనరల్​ సెక్రటరీ  

న్యాయం చేయాలి
ఆన్​లైన్​లో వొకేషనల్ విద్యాబోధనకు అవకాశంఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
– అబ్దుల్​ఖలీల్, వొకేషనల్​టీచర్, ఝరాసంఘం, సంగారెడ్డి జిల్లా