డీఎస్సీకి సర్కారు కసరత్తు..11 వేల పోస్టులు భర్తీ చేసే చాన్స్

డీఎస్సీకి సర్కారు కసరత్తు..11 వేల పోస్టులు భర్తీ చేసే చాన్స్
  • డీఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ
  • గత నోటిఫికేషన్​కు మరిన్ని పోస్టులు యాడ్!

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఏఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డీఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. గతంలో నోటిఫికేషన్​లో ఇచ్చిన  పోస్టులకు డబుల్ ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూలో డీఎస్సీ నిర్వహణపై చర్చించారు. ఎంతమంది పిల్లలున్నా సర్కారు స్కూళ్లను నడపాల్సిందేనని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డీఎస్సీ నిర్వహించాలని, దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి గత సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 1.77 లక్షల మంది అప్లై చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ లో జరగాల్సిన రాత పరీక్షను వాయిదా వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా మెగా డీఎస్సీ నిర్వహణకు విద్యాశాఖకు కొత్త సర్కారు ఆదేశాలిచ్చింది. దీంతో గతంలో  ఇచ్చిన నోటిఫికేషన్​కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి పలు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నది.

11 వేల పోస్టులతో డీఎస్సీ?

స్టేట్​లో 1.22 లక్షల టీచర్ పోస్టులకు గాను.. 1.03 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ, టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో గత సర్కారు హయాంలోనే 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా.. కేవలం 5,089 పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఇటీవల హెడ్మాస్టర్ల ప్రమోషన్లు జరిగాయి. దీంతో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను డీఈఓల నుంచి అధికారులు సేకరిస్తున్నారు. వీటితో పాటు సర్కారు బడుల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారానే భర్తీ చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా 11 వేల పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని, వాటన్నింటినీ డీఎస్సీ ద్వారా నింపే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సేకరించిన వివరాలను సర్కారుకు అందించి, పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకోనున్నారు. చివరగా మార్పులతో డీఎస్సీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని భర్తీ చేయనున్నారు.