
- కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మాండవీయ
న్యూఢిల్లీ: బేసిక్ కెమికల్స్ కోసం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీము తేవడానికి ప్లాన్ చేస్తున్నట్లు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అందుబాటు ధరలలో క్వాలిటీ ఫార్మా–మెడికల్ డివైసెస్ తయారు చేయాలని మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమను మంత్రి కోరారు. ఫార్మా అండ్ మెడికల్ డివైసెస్ సెక్టార్‌పై జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో శుక్రవారం మంత్రి మాండవీయ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పేదలకు, రైతులకు మాత్రమే కాకుండా పరిశ్రమకూ స్నేహపూర్వకమైనదేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రతినిధులు, స్టేక్హోల్డర్లందరితో చర్చించాకే పాలసీలకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. ఫార్మసీ ఆఫ్ వరల్డ్‌గా ఇండియా పేరొందిందని చెబుతూ, రీసెర్చ్–ఇన్నొవేషన్స్‌పై పరిశ్రమ ఫోకస్ పెట్టాలని మంత్రి సూచించారు. ఇలా చేయడం ద్వారా మన దేశానికి ఉన్న లీడర్షిప్ పొజిషన్‌ను కొనసాగించుకోవచ్చని అన్నారు. గ్లోబల్మార్కెట్లో పోటీ తట్టుకునేందుకు మన దేశంలోని పరిశ్రమ రెడీగా ఉండాలని పేర్కొన్నారు. క్వాలిటీ ప్రొడక్టులను అందుబాటు ధరలలో తేవడం చాలా ముఖ్యమైనదని వివరించారు. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని, ప్రభుత్వం కూడా క్వాలిటీ పరమైన తప్పులను సహించబోదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫార్మా, మెడికల్ డివైసెస్ సెక్టార్లలో క్వాలిటీ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు మద్దతు ఇవ్వాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరారు. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గ్లోబల్ కాంపిటీషన్లో మనం వెనకబడాల్సి వస్తుందని చెప్పారు. డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచేందుకు ఇప్పటికే పీఎల్ఐ 1, పీఎల్ఐ 2 స్కీములను ఈ సెక్టార్లో తీసుకొచ్చామని చెబుతూ, రాబోయే రోజులలో బేసిక్ కెమికల్స్ కోసమూ మరో పీఎల్ఐ స్కీమును తేనున్నామని వెల్లడించారు. ఆగ్రో–కెమికల్స్, పెట్రో–కెమికల్స్, ఫార్మా ఏపీఐ పరిశ్రమ రంగాలకు బేసిక్ కెమికల్స్చాలా అవసరమని పేర్కొన్నారు.