రేపటితో అసెంబ్లీ సమావేశాలు ఆపేసే యోచనలో ప్రభుత్వం!

రేపటితో అసెంబ్లీ సమావేశాలు ఆపేసే యోచనలో ప్రభుత్వం!

సమావేశాలు కుదించే యోచనలో సర్కారు
సెప్టెంబరు 17 భయంతో కరోనా పేరిట ముగించాలని ప్లాన్!

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలను కుదించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీ, మండలి రెండింటినీ నిరవధికంగా వాయిదా వేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిసింది. రెండు సభల్లో టీఆర్ఎస్​ సర్కారు ఓకే చేయించుకోవాలనుకున్న బిల్లులు దాదాపుగా క్లియర్​ అయ్యాయి. మరోవైపు సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్​తో బీజేపీ ఆందోళనలు చేస్తోంది. ఇదే టైంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, బందోబస్తు డ్యూటీలో ఉన్న 20 మంది పోలీస్​ కానిస్టేబుళ్లకు పాజిటివ్​ వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని సర్కారు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అసెంబ్లీకి వచ్చే వారికి పాజిటివ్ ఉంటున్న నేపథ్యంలో సెషన్స్ ను కొనసాగించడం సరికాదన్న వాదన వచ్చింది. ఇప్పటికే స్పీకర్​కు ఈ ప్రతిపాదనను తెలియజేసినట్టు సమాచారం. స్పీకర్ మంగళవారం బీఏసీ మీటింగ్ నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకునే చాన్స్ ఉంది.

కావాల్సినవి అయిపోవడంతో..

ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. 28వ తేదీ వరకు మొత్తం 18 వర్కింగ్​ డేస్​లో సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ, కౌన్సిల్​ బీఏసీల్లో నిర్ణయించారు.  సోమవారం అసెంబ్లీలో 8 బిల్లులు, కౌన్సిల్​లో 4 బిల్లులు పాస్​ అయ్యాయి. మంగళవారం కౌన్సిల్​లో మిగతా బిల్లులను ఓకే చేయనున్నారు. దీంతో ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనుకున్న పనులన్నీ పూర్తికానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్తున్న రెవెన్యూ బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లును రాజ్ భవన్ కు పంపించే పనిలో అసెంబ్లీ సెక్రటేరియట్  బిజీగా ఉంది.

‘సెప్టెంబర్​ 17’ డిమాండ్లతోనూ..

అసెంబ్లీ సమావేశాలను కుదించాలనే ఆలోచన వెనక సెప్టెంబర్​ 17 విమోచన దినోత్సవ డిమాండ్​ కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఈ అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే వాదన మొదలుపెట్టారు. కానీ బీజేపీ మాత్రం సెప్టెంబర్​ 17ను రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి పేరిట ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో అసెంబ్లీలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అసెంబ్లీకి వచ్చే రోడ్లన్నీ మూసేసి, వందల మందిని అరెస్టు చేయాల్సి వచ్చింది. మళ్లీ సెప్టెంబర్​ 17న బీజేపీ శ్రేణులు అసెంబ్లీని ముట్టడించే వ్యూహంలో ఉన్నట్టు నిఘా వర్గాలు సర్కారుకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

For More News..

‘కాళేశ్వరం’ అక్కర్లేకుండానే నిండిన ఎస్సారెస్పీ

సిటీలో మళ్లీ మొదలైన నైట్ లైఫ్

ఆల్టర్నేట్​ రోడ్లు లేవు.. స్కైవే లేదు