- డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- కరీంనగర్‌లో సీఎం కప్-2025 టార్చ్ ర్యాలీ
కరీంనగర్, వెలుగు: క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం నుంచి చీఫ్ మినిస్టర్ కప్- 2025 టార్చ్ ర్యాలీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ ర్యాలీ తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో క్రీడాకారులకు రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి కావని, ఈ ప్రభుత్వం వచ్చాక క్రీడాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ఆడి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారని తెలిపారు.
యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. సుడా చైర్మన్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా అధికంగా నిధులు కేటాయిస్తూ సదుపాయాలు కల్పిస్తోందన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, డీవైఎస్‌వో శ్రీనివాస్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్‌ప్రకాశ్, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేశ్, పడాల రాహుల్, సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
