ప్రైవేటు ఫంక్షన్​ హాల్​కు సర్కారు రోడ్డు

ప్రైవేటు ఫంక్షన్​ హాల్​కు సర్కారు రోడ్డు
  • రూ.40 లక్షల ఈజీఎస్​ ఫండ్స్​ పక్కదారి
  • మాజీ మంత్రి అండదండలతో నిర్వాకం 
  • అప్పటి అధికార దుర్వినియోగం పై విమర్శలు 

జనగామ, వెలుగు :  గత ప్రభుత్వం హయాంలో స్వార్థ ప్రయోజనాల కోసం అవసరం లేని చోట ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా నడుచుకున్నారు. జనగామ జిల్లా కేంద్రం శివారు లోని ప్రైవేట్​ భ్రమరాంబ ఫంక్షన్​ హాల్​ కు సర్కారు నిధులతో సీసీ రోడ్డు వేశారు.  ఎలక్షన్లకు ముందు సుమారు ఆర్నెళ్ల కింద వేసిన ఈ అక్రమ రోడ్డు తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని వెనక ఓ మాజీ మంత్రి ఉన్నాడనే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అరకిలోమీటర్​ మేర రోడ్డు 

జనగామ జిల్లా కేంద్రంగా మారడంతో శరవేగంగా డెవలప్​ అవుతూ వస్తోంది. కొత్త ఫంక్షన్​ హాళ్ల నిర్మాణా​లు పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలో సూర్యాపేట రోడ్డులో కొన్నేండ్ల కింద భ్రమరాంబ ఏసీ ఫంక్షన్​ హాల్​ ఏర్పాటైంది. దీనికి గిరాకీ పెరగడంతో దాని ఎదురుగానే నాన్​ ఏసీ ఫంక్షన్​ హాల్​ నిర్మాణం చేపట్టారు. ఈ రెండింటికి మెయిన్​ రోడ్​ నుంచి సుమారు అర కిలోమీటర్​  దూరం ఉండగా..  మట్టి రోడ్డు వేసుకున్నారు. వానాకాలంలో బురద, ఎండకాలంలో దుమ్ముతో ఫంక్షన్​ హాల్​ లకు వచ్చి వెళ్లేవారికి ఇబ్బందులు  కలిగేవి. ఈ క్రమంలో ఆర్నెళ్ల కింద మట్టి రోడ్డు పోయి సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. 

 ఆలస్యంగా వెలుగులోకి..

 సుమారు అర కిలోమీటర్​ పొడవున్న ఈ సీసీ రోడ్డును రూ.40 లక్షల ఎన్​ఆర్​ఈజీఎస్​ నిధులతో నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. ఇండ్ల నిర్మాణాలు ఉన్న చోట వదిలేసి కేవలం రెండు ఫంక్షన్​  హాల్​ఉ  ఉన్న చోటకు రోడ్డు వేయడం దుమారం రేపుతోంది. అప్పటి మాజీ మంత్రి అండదండలతో సదరు వ్యాపారులు రోడ్డు వేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఇల్లు కూడా లేని ఇక్కడ రూ. 40 లక్షలు వెచ్చించి సర్కారు రోడ్డు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు వస్తున్నాయి.  

కాగా ఈ ప్రాంతం జనగామ జిల్లా కేంద్రంతో కలిసి ఉన్నప్పటికీ రెవెన్యూ పరిధి మాత్రం లింగాల ఘన్​పూర్ మండలం నెల్లుట్ల కిందకు వస్తుంది. దీంతో నెల్లుట్ల గ్రామ పంచాయతీలో తీర్మానం చేయించి ఈ రోడ్డును దర్జాగా వేసేశారు. గుట్టుచప్పుడు గా పని కానిచ్చేశారు. ఇటు జనగామకు అటు నెల్లుట్లకు మధ్యలో రోడ్డు పక్కన అన్నట్లు సదరు ఫంక్షన్​ హాల్​ ఉండడంతో సర్కారు నిధులతో రోడ్డు వేశారన్న అనుమానాలు కూడా ఎవరికీ రాలేదు. నికాగా, ఈజీఎస్​ నిధులతో ప్రైవేటు ఫంక్షన్​ హాల్​కు రోడ్డు ఎలా వేశారని డీఆర్​డీఓ మొగులప్పను వివరణ కోరగా సదరు నిధులు ఈజీఎస్​వి ఐనప్పటికీ రోడ్డు నిర్మాణం పంచాయతీ రాజ్​ శాఖ వారు చేపట్టారని అంతకు మించి తనకేమీ తెలియదని 
అన్నారు.

  సీసీ రోడ్డు నిర్మించాం 
 

.మెయిన్​ రోడ్​ నుంచి భ్రమరాంబ ఫంక్షన్​ హాల్​ వరకు సుమారు రూ.40 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మించింది వాస్తవమే. ఈజీఎస్​ ఫండ్స్​తో ఈ పనులు చేపట్టాం. కేవలం ఫంక్షన్​ హాల్​ కోసం రోడ్డు వేసినట్లు భావించవద్దు. సదరు ప్రాంతంలో ఇండ్ల ప్లాట్లు ఉన్నాయి. మున్ముందు వారు ఇండ్లు​ కట్టుకుంటే రోడ్డు ఉండాలని నిర్మాణం చేపట్టాం.  
- పీఆర్​ ఈఈ చంద్రశేఖర్​, జనగామ