వరి కొయ్యలు కాల్చిన రైతులకు ఫైన్..కథలాపూర్ మండలంలో 8 మంది రైతులపై చర్యలు

వరి కొయ్యలు కాల్చిన రైతులకు ఫైన్..కథలాపూర్ మండలంలో 8 మంది రైతులపై చర్యలు
  • ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా

జగిత్యాల, వెలుగు: పంట పొలాల్లో వరి కొయ్యలను కాల్చుతున్న రైతులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాం తండాలో వరి కొయ్యలకు నిప్పంటించిన ఎనిమిది మంది రైతులకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు జరిమానాలు విధించారు. ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.40 వేల ఫైన్ వేశారు. 

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ ఆదేశాల మేరకు ఏవో యోగిత ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అగ్నిప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని గతంలోనే వరి కొయ్యలను కాల్చరాదంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.

 రాజారాం తండాలో వరి కొయ్యలు కాల్చిన విషయాన్ని గుర్తించిన అధికారులు గ్రామ కార్యదర్శి నరేశ్, సర్పంచ్ భూక్య తిరుపతి, ఉపసర్పంచ్ లకావత్ రాజేందర్ సమక్షంలో జరిమానాలు విధించారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపాలని, పశువుల మేతగా, సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని అధికారులు సూచించారు.