ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో స్పుత్నిక్ వి 

ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో స్పుత్నిక్ వి 

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందింది. ప్రస్తుతం భారత్ లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. థర్డ్ వేవ్ తప్పదన్న అంచనాలు, డెల్టా ప్లస్ వేరియంట్ తో ముప్పు ఉందన్న ఆందోళనల క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు. ఇప్పటి వరకు స్పుత్నిక్ వి ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉందని.. ఇకపై కేంద్ర ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల సరఫరా ఆధారంగా ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయింపులు ఉంటాయని చెప్పారు. 

ఈ వ్యాక్సిన్ ను మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచాల్సి ఉంటుందని, సౌకర్యాలను ఉపయోగించుకుని స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను కూడా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా రవాణా చేస్తామని డాక్టర్ అరోరా చెప్పారు.