అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి రెండు కళ్లు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి రెండు కళ్లు : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : అభివృద్ధి, సంక్షేమం అనేవి రాష్ట్రానికి రెండు కళ్లు అని, అందుకే ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రెండింటిని సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. శుక్రవారం బొమ్మలరామారం, తుర్కపల్లి మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‌రేషన్ కార్డు అనేది కేవలం రేషన్ బియ్యానికి మాత్రమే అవసరమొచ్చే పేపర్ కాదని, ఇది పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అవసరం ఉంటుందని, అందుకే అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. 

రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. అంతకుముందు బొమ్మలరామారం మండలం మర్యాల, పిల్లిగుండ్లతండాలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్లు భాస్కర్ రావు, వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, బొమ్మలరామారం మండల మహిళా విభాగం అధ్యక్షుడు సునీత  పాల్గొన్నారు.