
- ‘కర్తవ్య భవన్’తో ఇకపై రెంట్ ఆదా అవుతుంది: మోదీ
- పాత భవనాల్లో సౌలతులకూ ఇబ్బందులు
- ఇకపై అన్ని శాఖలకూ ఒకే చోట ఆఫీసులు
- ‘కర్తవ్య భవన్-03’ బిల్డింగ్‌ను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ఆఫీసు భవనాలకు ఏటా రూ. 1,500 కోట్ల రెంట్ అవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి, పాత భవనాల్లో సౌలతుల ఏర్పాటుకు కూడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటికీ ఒకే చోట ఆఫీసుల ఏర్పాటు కోసం ‘కర్తవ్య భవన్’లు నిర్మిస్తున్నామన్నారు.
బుధవారం ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో కర్తవ్య భవన్–03 బిల్డింగ్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్తవ్య భవన్ ల నిర్మాణంతో ఏటా పెద్ద ఎత్తున రెంట్ ఆదా అవుతుందన్నారు. కొత్త బిల్డింగులలో సరైన వెలుతురు, స్థలంలో అధునాతన సౌలతులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం హోం శాఖ కొనసాగుతున్న ఆఫీసు బిల్డింగ్ వందేళ్లనాటిదని.. ఢిల్లీలోని 50 చోట్ల ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల ఆఫీసులు కూడా ఇలాగే ఉన్నాయన్నారు.
మొత్తం పది భవనాల నిర్మాణం..
కేంద్ర మంత్రిత్వ శాఖల ఆఫీసుల కోసం కేంద్ర ప్రభుత్వం కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్(సీసీఎస్) సముదాయంలో భాగంగా 10 కర్తవ్య భవన్ బిల్డింగులను నిర్మిస్తోంది. వీటిలో కర్తవ్య భవన్–3 నిర్మాణం తొలుత పూర్తవడంతో దీనిని ప్రధాని ప్రారంభించారు.
ఇందులో హోం, విదేశాంగ, రూరల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, డీవోపీటీ, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖల ఆఫీసులతోపాటు ప్రధానమంత్రి సైంటిఫిక్ అడ్వయిజరీ ఆఫీసు కూడా ఉంటుంది.
ప్రస్తుతం చాలా మంత్రిత్వ శాఖల ఆఫీసులు శాస్త్రిభవన్, కృషిభవన్, ఉద్యోగభవన్, నిర్మాణ్ భవన్లో నడుస్తున్నాయి. 1950 నుంచి 1970 మధ్య నిర్మించిన ఈ భవనాలు పాతపడటంతో వాటి స్థానంలో సీసీఎస్ పేరిట బిల్డింగ్స్‌ను సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. 2019లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మొదలైంది.
ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే పార్లమెంట్ బిల్డింగ్, వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్, కర్తవ్యపథ్‌ను నిర్మించారు. సీసీఎస్ కు పక్కనే ప్రధాని నివాసం, ఆఫీసు(పీఎంవో), కేబినెట్ సెక్రటేరియెట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియెట్‌ను కూడా కట్టనున్నారు.