- ఆర్టీసీ సమ్మె నుంచి జేపీఎస్‌ల దాకా బెదిరింపులే
- ఉద్యోగులను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు సర్కారు వ్యూహం
- మూడేండ్ల కిందట ఆర్టీసీలో సంఘాల రద్దు.. సమ్మె చేయకుండా నిషేధాలు
- రెండేండ్లు పోరాడితేగానీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోలే
- మూడేండ్లుగా వీఆర్ఏల ఎదురుచూపు
- ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించి దారిలోకి తెచ్చుకున్న సర్కారు
- జేపీఎస్‌లను తీసేస్తమని బెదిరింపులు.. వారి ఇండ్లకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా పని చేసిన ఉద్యోగులపై రాష్ట్ర సర్కారు బెదిరింపులకు దిగుతున్నది. నాడు పెన్ డౌన్ చేసి ఉద్యమానికి ఊపిరిలూదిన వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. గొంతెత్తితే అణచివేత ధోరణితో కక్ష సాధింపులకు పాల్పడుతున్నది. తమ డిమాండ్లను తీర్చాలని ఎంప్లాయిస్ విజ్ఞప్తులు చేస్తే పట్టించుకోని సర్కారు.. ఓపిక నశించి వాళ్లు సమ్మె బాట పడితే మాత్రం సహించడం లేదు. వారిపై ఎస్మాలు ప్రయోగిస్తూ, ఉద్యోగాల్లోంచి తీసేస్తూ భయపెట్టి తన దారిలోకి తెచ్చుకుంటున్నది. మూడేండ్ల నాటి ఆర్టీసీ సమ్మె దగ్గర్నుంచి.. ఇప్పటి జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)ల సమ్మె వరకు కేసీఆర్ సర్కారు అనుసరించిన ఫార్ములా బెదిరింపులే! కొద్ది రోజుల కిందట సమ్మెకు దిగిన ఆర్టిజన్లలో కొందరిని జాబ్‌లో నుంచి తీసేసి.. భయపెట్టి తిరిగి విధుల్లో చేరేలా చేసింది. ఇప్పుడు కూడా ఉద్యోగాల్లో చేరకుంటే జాబ్స్ పీకేస్తామంటూ జేపీఎస్‌లకు వార్నింగ్ ఇచ్చి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు డెడ్‌లైన్ పెట్టింది. వాళ్ల ఇండ్లకు నోటీసులను అంటించడం గమనార్హం. ప్రభుత్వం ఇంత చేస్తుంటే స్పందించాల్సిన ఉద్యోగ సంఘాలు.. సప్పుడు చేయకపోవడం గమనార్హం. అండగా మేమున్నామని.. ఇటు టీఎన్‌జీవో నేతలుగానీ.. టీజీవో నేతలుగానీ ఒక్క సందర్భంలోనైనా మద్దతిచ్చిన పాపానపోలేదు.
ప్రైవేటోళ్లను పెట్టి బస్సులు నడిపిన్రు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన అతిపెద్ద సమ్మె ఆర్టీసీ ఉద్యోగులది. 2019 అక్టోబర్ 4 అర్ధరాత్రి మొదలు నవంబర్ 25 వరకు 52 రోజులపాటు జరిగిన సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై సర్కారు అణచివేత ఫార్ములానే ఎంచుకున్నది. 11 డిమాండ్లతో సమ్మెకు దిగిన 48 వేల మందికిపైగా ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించింది. ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నట్టు ప్రకటన చేసింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించే ప్రయత్నాలు చేసింది. అయినా ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగలేదు. ఈ క్రమంలోనే ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్, హైదరాబాద్‌లో సురేందర్‌గౌడ్ అనే కండక్టర్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగులు, కార్మికులపై లాఠీచార్జ్ చేయించింది. తర్వాత కార్మికులు చర్చలకు ముందుకొచ్చినా.. సర్కారు మొండిపట్టు వీడలేదు. కొందరు ఉద్యోగులు సమ్మె విరమించి డ్యూటీలో చేరేందుకు వెళ్లినా అధికారులు వారిని విధుల్లోకి తీసుకోలేదు. పైగా ఉద్యోగుల సమ్మె అక్రమమంటూ హైకోర్టులో సర్కారు పిటిషన్ వేసింది. ప్రభుత్వం, కార్మికులు చర్చించుకుని సమ్మెకు ముగింపు పలకాలని హైకోర్టు సూచించినా సర్కారు స్పందించలేదు. చివరకు కార్మికులే సమ్మె విరమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఆర్టీసీలో కార్మిక సంఘాలను సర్కారు రద్దు చేసింది. కార్మికులు, సంఘాల నేతలతో డిక్లరేషన్ చేయిస్తూ సంతకాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను 2019 డిసెంబర్ 1న ప్రగతిభవన్‌కు పిలిపించి, భోజనం పెట్టి, సమస్యలను పరిష్కరిస్తామన్న కేసీఆర్.. తన మాటను నిలబెట్టుకోలేదు.
ఫీల్డ్ అసిస్టెంట్ల గోస
ఫీల్డ్ అసిస్టెంట్ల గోస వర్ణనాతీతం. తమ ఉద్యోగాల కోసం దాదాపు రెండేండ్లపాటు వాళ్లు ఫైట్ చేశారు. రెగ్యులరైజ్ చేయాలని, నెలకు రూ.21 వేల జీతం ఇవ్వాలని.. ఇతర డిమాండ్లతో 2020 మార్చి 12న సమ్మెకు దిగారు. కరోనా నేపథ్యంలో వారం రోజుల్లోనే వాళ్లు సమ్మెను విరమించారు. మార్చి 25న 7,700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగం నుంచి తొలగించింది. వాళ్లు తమ ఉద్యోగాల కోసం కనిపించిన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞప్తులు చేశారు. కాళ్ల మీద పడ్డారు. కానీ స్పందించిన వాళ్లు లేరు. దాదాపు 28 నెలల పాటు జీతాల్లేక ఫీల్డ్ అసిస్టెంట్లు అవస్థలు పడ్డారు. ఇదే క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా 1,200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలను పోలీసుల అండతో సర్కారు అడ్డుకుంది. చివరకు 2022 ఆగస్టు 10న వారిని సర్కారు విధుల్లోకి తీసుకుంది.
జేపీఎస్‌లపై మరింత రచ్చ
రెగ్యులరైజేషన్, జీతం పెంపు వంటి డిమాండ్లతో ఏప్రిల్ 28న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మెకు దిగారు. 11 రోజులుగా వారు సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కారు.. సోమవారం (మే 8న) వారికి అల్టిమేటం జారీ చేసింది. మే 9న సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని, లేదంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం పలు జిల్లాల్లో కొందరు ఉద్యోగులు భయపడి విధుల్లో చేరారు. మరికొందరు సమ్మెలో ఉన్నారు. దీంతో సర్కారు అధికారులతో జేపీఎస్‌ల ఇండ్లకు నోటీసులను అంటించింది. ఈ చర్యతో జేపీఎస్‌లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీళ్లే కాదు.. 317 జీవోను రద్దు చేయాలంటూ టీచర్లు సమ్మె చేస్తే.. వారిపైనా ఇదే రీతిలో వ్యవహరించింది.
సమ్మె నిషిద్ధమట
సమ్మె జరిగిన ప్రతి సందర్భంలోనూ అక్రమమంటూ సర్కార్ చెప్తున్నది. ఉద్యోగాల్లో చేరేముందు సమ్మె చేయబోమంటూ రాసిచ్చారని, కాబట్టి స్ట్రైక్స్ చేసే అర్హత లేదని వాదిస్తూ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నది. జేపీఎస్‌లు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం సమ్మె చేయడం నిషిద్ధమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కోర్టుకు పోయినా ఏం చేయలేరని బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆర్టిజన్లను తీసేసి.. బెదిరించి..
పీఆర్సీ డిమాండ్‌తో ఆర్టిజన్లు ఈ ఏడాది ఏప్రిల్ 25న సమ్మెకు దిగారు. 7% ఫిట్మెంటే ఇవ్వడంతో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్, ఎంఐఎంకు చెందిన ఇత్తెహాద్ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. కానీ సర్కారు వారిపై తొలిరోజే కఠినంగా వ్యవహరించింది. ఎస్మా ప్రయోగించింది. 200 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. దీంతో భయపడిన ఆర్టిజన్లు తెల్లారే ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ తర్వాత సంగతి.. ఉద్యోగాలుంటే చాలన్న పరిస్థితికి వారిని సర్కారు తీసుకొచ్చింది.
వీఆర్ఏల పరిస్థితి అగమ్యగోచరం
రెవెన్యూ శాఖలో అవినీతి భారీగా పెరిగిపోయిందంటూ ఆ శాఖపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2020 సెప్టెంబర్ 7న వీఆర్వో వ్యవస్థను రద్దు చేసేసి.. రికార్డులను కలెక్టర్లకు అప్పజెప్పాలంటూ కేవలం కొన్ని గంటల డెడ్‌లైన్ పెట్టారు. వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా చేసి వివిధ శాఖల్లోకి తీసుకున్నా.. వీఆర్ఏలను పట్టించుకోలేదు. 23 వేల మంది వీఆర్ఏలు రోడ్డునపడే పరిస్థితి. దీంతో 2022 జులైలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. 83 రోజుల పాటు సమ్మె చేసినా సర్కారు పట్టించుకోలేదు. మునుగోడు బై ఎలక్షన్ రావడంతో సర్కారు వారితో అక్టోబర్‌లో చర్చలు జరిపింది. ఎన్నికలు కాగానే హామీలు తీరుస్తామని అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలతో కేటీఆర్ మాట్లాడారు. కానీ ఇప్పటిదాకా వారికిచ్చిన హామీలను తీర్చింది లేదు.
ఉద్యోగ సంఘాలు సైలెంట్
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులది కీలకపాత్ర. ఆనాడు సకల జనుల సమ్మె పేరుతో ప్రతి ఒక్కరూ ఉద్యమించారు. పెన్‌డౌన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే తమ ఉనికి కోసం సమ్మె చేస్తుంటే సర్కారు అణచివేతలకు పాల్పడుతున్నది. ఇంత జరుగుతున్నా ఉద్యోగ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు తమకేం సంబంధం లేదన్నట్టు సైలెంట్ అయిపోయారు. తమకు మద్దతివ్వాలని ఉద్యోగ సంఘాలను కోరితే ‘బేషరతుగా సమ్మె విరమిస్తేనే సర్కారుతో మాట్లాడతాం’ అని టీఎన్‌జీవోకు చెందిన ఓ నేత
చాయతీ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు.