పాలమూరు యూనివర్సిటీలో సంబురంగా స్నాతకోత్సవం

పాలమూరు యూనివర్సిటీలో  సంబురంగా స్నాతకోత్సవం
  • పీయూలో 77 మంది విద్యార్థులకు గోల్డ్​ మెడల్స్​ అందించిన వర్సిటీ చాన్స్​లర్, గవర్నర్ ​జిష్ణుదేవ్​వర్మ

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు:  పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం గురువారం సంబురంగా సాగింది. చీఫ్​గెస్ట్​గా హాజరైన వర్సిటీ చాన్స్​లర్, గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ.. ముందుగా పాలమూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మన్నె సత్యానారాయణ రెడ్డికి గౌరవ డాక్టరేట్​ప్రదానం చేశారు. అనంతరం మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, బిజినెస్​ మేనేజ్​మెంట్​లో పీహెచ్​డీ చేసిన 12 మందికి పట్టాలు అందజేశారు. 

తర్వాత 2020, 2021, 2022లో పీజీ కోర్సులైన ఇంగ్లిష్, ఎకనామిక్స్, హిస్టరీ, సోషల్ వర్క్​, పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, పొలిటికల్​సైన్స్, ఎంకాం, ఎంబీఏ, బొటనీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, జువాలజీ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్​, ఇంటిగ్రేడెట్​కెమిస్ట్రీ, ఎన్విరాన్​మెంటల్​సైన్స్, ప్రొఫెషన్​ కోర్సులైన బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మా డీ, ఎంఈడీ, బీఈడీ, బీపీఈడీ, అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ)​లో బీఏ, బీకాం, బీఎస్సీ, పీబీఏలో అత్యధిక మార్కులు సాధించిన 83 మంది స్టూడెంట్లకు గానూ 77 మందికి వీసీ జీఎన్.శ్రీనివాస్​తో కలిసి గోల్డ్​ మెడల్స్​అందించారు. మిగతా వారు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. 

వారికి వీసీ చేతులమీదుగా త్వరలో పతకాలు అందించనున్నారు. వక్తల ప్రసంగం అనంతరం గవర్నర్​, మన్నె సత్యనారాయణ రెడ్డిని వర్సిటీ సిబ్బంది శాలువాలతో సత్కరించి, మెమొంటోలు అందజేశారు. కాన్వొకేషన్​ ముగిసిన అనంతరం పీహెచ్​డీ పట్టాలు, గోల్డ్​ మెడల్స్​ సాధించిన స్టూడెంట్లు తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​లో కలిసి ఫొటో సెషన్​లో పాల్గొన్నారు. 

కార్యక్రమం సాగిందిలా..

షెడ్యూల్ ప్రకారం..  గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ హైదరాబాద్​ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఉదయం 10.57 గంటలకు వర్సిటీ వద్దకు చేరుకున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి 11.02 గంటలకు వర్సిటీ సెంట్రల్​ లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కాన్వొకేషన్​కు హాజరయ్యారు. 11.03 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించి, 11.05 గంటలకు ముగించారు. 11.05 గంటలకు కాన్వొకేషన్ ప్రారంభమైంది. మొదట ఎంఎస్ఎన్ గ్రూప్​ఆఫ్​కంపెనీస్ ఫౌండర్, ఎండీ మన్నె సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. అనంతరం వర్సిటీ అభివృద్ధిపై వీసీ మాట్లాడారు. మధ్యాహ్నం 12.04 నిమిషాలకు గవర్నర్​ ప్రసంగం ప్రారంభించి, 8 నిమిషాలు మాట్లాడారు. అనంతరం జాతీయ గీతాలాపన తర్వాత స్నాతకోత్సవాన్ని ముగించారు. 

సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేస్తా..

మాది నాగర్​కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం నర్సంపల్లి. నాన్న చిన్నయ్య గౌడ్​ రైతు. డిగ్రీ జడ్చర్ల బీఆర్​ఆర్​కాలేజీలో పూర్తి చేశా. ప్రస్తుతం పాలమూరు వర్సిటీలో మైక్రో బయాలజీలో పీహెచ్​డీ పూర్తి చేసి పట్టా అందుకోవడం సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేయడమే నా జీవిత ఆశయం. - విజయ్​కుమార్​, పీహెచ్​డీ పట్టాదారు

నోట్స్​ ప్రిపేర్​ చేసుకున్న..

మాది మహబూబాబాద్​జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం తండా. అమ్మ సుజాత, నాన్న రవి వ్యవసాయం చేస్తుంటారు. జనగామ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా.. లెక్చరర్లు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేయమని చెప్పారు. యూట్యూబ్​లో చూసి నోట్స్​ప్రిపేర్ చేసుకున్న. గ్రూప్–1 జాబ్ సాధించడమే నా గోల్​.- బానోతు శిరీష, గోల్డ్ మెడలిస్ట్​

నాకు చదువంటే ఆసక్తి

మా ఆయన డాక్టర్. నాకు ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. చదువంటే ఇష్టం. నా భర్త ప్రోత్సాహంతో కామర్స్​లో పీహెచ్​డీ చేశా. హైదరాబాద్​లోని హిమాయత్ నగర్​లో ఉన్న ఓ ప్రైవేట్​ డిగ్రీ కాలేజ్​లో అసోసియేట్ ప్రొఫెసర్​గా పని చేస్తున్న. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీహెచ్​డీ పూర్తి చేశా.- రితిక బజాజ్, పీహెచ్​డీ పట్టాదారు