ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి

ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి
  • మహిళలకు గవర్నర్ తమిళిసై భరోసా
  • ఇక్కడికి వచ్చారంటే సమస్య పరిష్కారమైనట్లేనని హామీ
  • రాజ్‌‌భవన్‌‌లో మహిళా దర్బార్‌‌‌‌ ఫాలో అప్ ప్రోగ్రాం
  • హాజరైన జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ
  • జూబ్లీహిల్స్ గ్యాంగ్​ రేప్​ ఘటనపై రిపోర్ట్ ఇంకా ఇయ్యలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గవర్నర్ తమిళిసై సూచించారు. అమ్మలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో హెల్త్, ఎడ్యుకేషన్‌‌కు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌‌కు చెందిన ఇద్దరు మహిళలకు, సూర్యాపేట జిల్లాకు చెందిన మరో మహిళకు రూ.25 వేల చొప్పున సాయం అందజేశారు. సోమవారం రాజ్‌‌భవన్‌‌లో మహిళా దర్బార్ ఫాలో అప్ పోగ్రాంను గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘‘గత నెలలో నిర్వహించిన మహిళా దర్బార్‌‌‌‌లో సుమారు 400 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కేటగిరీల వారీగా డివైడ్ చేయగా, 41 ఫిర్యాదులు లీగల్‌‌వి ఉన్నాయి. ఈ 41 మందిని రాజ్ భవన్‌‌కు పిలిపించగా, 27 మంది హాజరయ్యారు. వీరికి ఉచిత న్యాయ సలహా కోసం అడ్వకేట్లను పిలిచాం. హెల్త్ సమస్యలకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్‌‌కు, ప్రైవేట్ హాస్పిటల్స్‌‌కు రిఫర్ చేశాం. ప్రభుత్వం  పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలను ఆయా శాఖలకు పంపించాం” అని వివరించారు.

ధైర్యంగా వెళ్లండి

కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం కాకుండా మహిళలకు మద్దతుగా నిలవాలనే , మానవతా దృక్పథంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గవర్నర్ తమిళిసై అన్నారు. ‘‘రాజ్‌‌భవన్‌‌కు వచ్చారంటే మీ సమస్య పరిష్కారమైనట్లే. ధైర్యంగా వెళ్లండి” అని మహిళలకు సూచించారు. హైదరాబాద్ జిల్లా లీగల్ అథారిటీకి చెందిన ఐదుగురు అడ్వొకేట్లను రాజ్‌‌భవన్ కు పిలిపించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను గవర్నర్‌‌‌‌, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ, అడ్వకేట్ల దృష్టికి తీసుకెళ్లారు. కొందరు మహిళలు భోరున విలపిస్తూ తమ సమస్యలను చెప్పుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ చాలా పవర్‌‌‌‌ఫుల్ అథారిటీ అని, సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో సలహాలు ఇస్తారని వారికి తమిళిసై తెలిపారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిలైందా అన్న మీడియా ప్రశ్నకు “ రాష్ర్టంలో ఏం జరుగుతున్నదో ప్రజలు గమనిస్తున్నారు” అని బదులిచ్చారు. సమస్యలు, గ్రీవెన్స్ కోసం వచ్చే వారికి సాయం చేయడం కోసమే ఒక ప్లాట్ ఫాం క్రియేట్ చేశామని చెప్పుకొచ్చారు..

డీజీపీ అపాయింట్‌‌మెంట్ ఇవ్వలే

రేఖా శర్మ మాట్లాడుతూ.. “ఇటీవల జూబ్లీహిల్స్‌‌లో బాలికపై జరిగిన ఘటన బాధాకరం. ఆ కేసులో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడిగితే ఇంత వరకు పంపలేదు. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. డీజీపీని అపాయింట్‌‌మెంట్ అడిగితే ఇవ్వలేదు. విమెన్ సేఫ్టీ డీజీని కలవమని చెప్పారు. కొన్ని పెండింగ్ కేసులపైనా పోలీసులు స్పందించటం లేదు. వీటిపై మంగళవారం డీజీపీని కలుస్తున్నా. జూబ్లీహిల్స్ ఘటనపై నివేదిక అడుగుతా” అని చెప్పారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా ముందు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయాలని, అక్కడ న్యాయం జరగకపోతే స్టేట్ మహిళా కమిషన్‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ మహిళా కమిషన్‌‌లో 200కు పైగా ఫిర్యాదులు పరిష్కారం కాకుండా పెండింగ్‌‌లో ఉన్నాయని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్‌‌లో 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ నంబర్ ఉందని, ఆన్‌‌లైన్‌‌లో ఫిర్యాదు చేయొచ్చన్నారు.