గవర్నర్ తమిళసై నిర్ణయం కరక్టే : కిషన్ రెడ్డి

గవర్నర్ తమిళసై  నిర్ణయం కరక్టే  : కిషన్ రెడ్డి
  • కేసీఆర్​ కాళ్ల దగ్గర పడుండే వాళ్లను ఎమ్మెల్సీలు చేయాలనుకోవడం సరికాదు
  • వచ్చేనెల 3న నిజామాబాద్​లో మోదీ సభ
  • బీజేపీ స్టేట్​ ఆఫీసులో ఘనంగా దీన్​ దయాళ్​​ జయంతి

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలను తమిళసై తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదన్నారు. ‘కేసీఆర్ కుటుంబం కాళ్లదగ్గర పడి ఉండేవాళ్లను, మోచేతి నీళ్లు తాగే వాళ్లను, ఆత్మగౌరవం లేని వాళ్లను బీఆర్ఎస్ సిఫార్సు చేస్తున్నది. గవర్నర్ కోటాలో అలాంటి వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలనుకోవడం సరికాదు. 

ఫైల్ రిజెక్ట్ ​చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైనదే’ అని అన్నారు. గవర్నర్ కోటాలో.. మేధావులకు, విద్యావంతులకు, కవులకు, రచయితలకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు, క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని కేసీఆర్​ సిఫారసు చేస్తే గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపితే.. రిజెక్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్​కు అనుకూలంగా ఉంటేనే గవర్నర్​గా వ్యవహరించినట్టా.. సీఎం తప్పులు, పొరపాట్లను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే నచ్చరా.. అని ప్రశ్నించారు.

మోదీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరు

దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల మేరకే కేంద్రంలో ప్రధాని మోదీ పాలన కొనసాగుతున్నదని కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో దీన్​దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అమీర్ పేట్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించి, మాట్లాడుతూ.. మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్​2 గాంధీ జయంతి వరకు పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

3న నిజామాబాద్‌లో మోదీ సభ

అక్టోబర్​ 1న మోదీ హైదరాబాద్​కు వస్తారని కిషన్​రెడ్డి చెప్పారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత పాలమూరుకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. ​3న నిజామాబాద్ సభలో మోదీ పాల్గొంటారని చెప్పారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మోదీ టూర్ సక్సెస్​కు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా జిల్లాల పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసేందుకు మంగళవారం నిజామాబాద్ కు కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ కు లక్ష్మణ్ వెళ్లనున్నారు.