గవర్నర్​గానే కొనసాగుతా.. ఎంపీగా పోటీ చేయట్లే: తమిళిసై

గవర్నర్​గానే కొనసాగుతా.. ఎంపీగా పోటీ చేయట్లే: తమిళిసై
  • గవర్నర్​గానే కొనసాగుతా
  • ఎంపీగా పోటీ చేయడం లేదు: తమిళిసై
  • అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసిన టింబర్​ డిపో సందర్శన
  • ఎంపీగా పోటీ చేయట్లే: తమిళిసై


సికింద్రాబాద్, వెలుగు: తాను ప్రజల కోసం పనిచేయడానికి ఇష్టపడతానని, గవర్నర్​గానే కొనసాగనున్నట్లు గవర్నర్​తమిళిసై స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని చెప్పారు. శనివారం అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామమందిర ద్వారాలకు బోయిన్​పల్లి తలుపులు తయారై వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ద్వారాలకు తలుపులు చక్కగా తీర్చిదిద్దడం బాగుందని అన్నారు. 

రామ మందిర నిర్మాణంలో అనురాధ టింబర్ ​డిపో గొప్ప పాత్రను పోషించిందని అభినందించారు. రామమందిర తలుపుల అద్భుతాలను స్వయంగా చూసేందుకే డిపో వరకు వచ్చినట్లు చెప్పారు. గవర్నర్​పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తమిళిసై క్లారిటీ ఇచ్చారు. తూత్తుకుడిలో వరద బాధితులను పరామర్శించేందుకే వెళ్లాలని, ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.

 అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలని ఢిల్లీకి వెళ్లి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి  గవర్నర్​గా కొనసాగుతున్నానని, భవిష్యత్​లోనూ గవర్నర్ గానే ఉంటానని స్పష్టం చేశారు.