2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి

2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి

ప్రధాని మోడీ మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ఇవాళ(మంగళవారం) ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మారిటైమ్ ఇండియా విజన్-2030 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మారిటైమ్ రంగంలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విజయంలో భాగస్వాములు కావాలంటూ ప్రపంచదేశాలకు మోడీ పిలుపునిచ్చారు. సముద్ర రంగంలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు.

దేశంలో నౌకాశ్రయాల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని, 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. జల రవాణా మార్గాలు చౌక మాత్రమే కాదని, పర్యావరణ హితం కూడా అని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు.

పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. సముద్రరంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అటు సముద్ర పర్యాటకానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని, 78 లైట్ హౌస్ ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రధాని.