పీక్అవర్స్‌‌‌‌లో మరింత బాదుడు.. క్యాబ్ ఫేర్ రెండింతలు

పీక్అవర్స్‌‌‌‌లో మరింత బాదుడు.. క్యాబ్ ఫేర్ రెండింతలు
  • క్యాబ్ అగ్రిగేటర్లకు గ్రీన్​సిగ్నల్​
  • బేస్ ఫేర్​పై 2 రెట్ల వరకు వసూలు 

న్యూఢిల్లీ: ఉబర్​, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు పీక్ అవర్స్ (ఎక్కువ డిమాండ్ ఉన్న సమయాలు)లో బేస్ చార్జీకి రెట్టింపు వరకు వసూలు చేయనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలు (ఎంవీఏజీ) 2025లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రయాణికులపై, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో క్యాబ్‌‌‌‌లు బుక్ చేసుకునే వారి జేబుపై భారీగా భారం పడనుంది. గతంలో పీక్ అవర్స్ లో క్యాబ్ అగ్రిగేటర్లు బేస్ చార్జీకి 1.5 రెట్లు మాత్రమే వసూలు చేయడానికి అనుమతి ఉండేది.

ఇప్పుడు ఈ పరిమితిని 2 రెట్లకు పెంచారు. అంటే, ఉదాహరణకు, బేస్ చార్జీ రూ. 100 అయితే, పీక్ అవర్స్ లో రూ. 200 వరకు వసూలు చేయవచ్చు. డిమాండ్ తక్కువగా ఉన్న సమయాల్లో, బేస్ చార్జీలో కనీసం 50 శాతం వసూలు చేయడానికి అగ్రిగేటర్లకు అనుమతి ఉంది. దీనివల్ల డ్రైవర్లకు కూడా కనీస ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, డ్రైవర్లు లేదా ప్రయాణికులు సరైన కారణం లేకుండా రైడ్‌‌‌‌ను రద్దు చేస్తే,  చార్జీలో 10 శాతం (రూ. 100 మించకుండా) జరిమానా పడుతుంది.  

ఇక నుంచి అన్ని బండ్లలో వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌‌‌‌లను తప్పనిసరి చేశారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను ట్రాక్ చేయడానికి, భద్రతను పర్యవేక్షించడానికి ఇవి సహాయపడుతాయి. ఈ కొత్త మార్గదర్శకాలను రాష్ట్రాలు మూడు నెలల్లోగా అమలు చేయాలి.