న్యూఢిల్లీ: ముందస్తు లోక్సభ ఎన్నికల ప్రకటన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినందుకు గానూ దాదాపు ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లను "బస్ట్" చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 23 లక్షల వ్యూవర్స్ ఉన్న యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కేపీఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, ఎస్పీఎన్ 9న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్, వరల్డ్ బెస్ట్ న్యూస్ - అనే యూట్యూబ్ ఛానళ్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వాస్తవాన్ని తనిఖీ చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు.
వరల్డ్ బెస్ట్ న్యూస్.. దీనికి 1.7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు.. 18 కోట్లకు పైగా వీక్షణలు ఉన్న యూట్యూబ్ ఛానల్.. దీని ద్వారా భారత సైన్యాన్ని తప్పుగా సూచిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరో యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ దోస్త్ .. ఇది ప్రభుత్వ పథకాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. SPN9 యూట్యూబ్ ఛానల్.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. సర్కారీ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రూ. 20 లకే వంట గ్యాస్ సిలిండర్లు, రూ. 15 కే పెట్రోల్ లభిస్తాయంటూ ప్రభుత్వ పథకాలు, ఆర్డర్లు, నిర్ణయాలకుసంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రతిపాలన, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ద్వారా వాస్తవాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో యూట్యూబ్ ఛానల్ ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి సంబంధించిన తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఎర్న్ ఇండియా టెక్ అనే యూట్యూబ్ ఛానల్ .. పాన్, ఆధార్ కార్డులకు సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

