పోలీస్​ పెట్రోలింగ్​ వాహనాలకు డీజిల్ కష్టాలు

పోలీస్​ పెట్రోలింగ్​ వాహనాలకు డీజిల్ కష్టాలు
  • ఫ్యూయల్​ ఫండ్స్​కు కోత పెట్టిన సర్కారు 
  • స్టేషన్ కే పరిమితమవుతున్న వాహనాలు 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో పోలీసులకు సర్కారు ఇన్నోవా వాహనాలను అందించింది. గస్తీ నిర్వహించేందుకు ప్రతి స్టేషన్‍కు రూరల్‍ ఏరియాలో ఒకటి,అర్బన్‍లో రెండు వాహనాలను కేటాయించింది. మొన్నటి వరకు సేవలు అందించిన వాహనాల్లో కొన్ని ప్రస్తుతం స్టేషన్లో మూలకు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల స్టేషన్​లకు ఇచ్చే ఫ్యూయల్​ఫండ్స్​కు సర్కారు కోత పెట్టడంతో పెట్రోలింగ్​కార్లకు డీజిల్‍ కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం పది రోజుల నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది.  కరీంనగర్​ జిల్లాలో పెట్రోలింగ్ కార్లు 18 ఉండగా.. బ్లూకోట్స్​ బైక్స్​40 ఉన్నాయి.  

అరకొర డీజిల్ తో.. అరకొర గస్తీ 
గతంలో ఒక్కో పెట్రోలింగ్​వాహనానికి నెలకు 120 లీటర్ల డీజిల్‍ ఇస్తుండగా, ప్రస్తుతం 80 లీటర్లకు తగ్గించారు.  గతంలోనూ ఇచ్చే120 లీటర్లు కూడా అరకొరగానే అందేది. ప్రస్తుతం అది కూడా తగ్గించడంతో పోలీసులు పెట్రోలింగ్​ వాహనాలను స్టేషన్‍ నుంచి బయటకు తీయడం లేదు. దీంతో గల్లీల్లో గస్తీ బండే కనిపించడం లేదు. రాత్రి పూట అరకొరగా గస్తీ కాస్తున్నా, పగటి పూట ఆ సంగతే మరిచారు. కొన్ని స్టేషన్లలో సీఐలు తిరిగే బొలేరో వాహనాలు సైతం డీజిల్‍ కొరతతో మూలన పెట్టారు. స్టేషన్లో రెండు, మూడు వెహికిల్స్ ఉంటే ఏదో ఒక బండికే డీజిల్‍ పోసుకొని వాడుతున్నారు. 

బతిమాలి పోయిస్తుండ్రు..
ఓవైపు సర్కార్‍ పూర్తిస్థాయిలో అందించాల్సిన డీజిల్‍లో కోత విధిస్తోండగా.. గతంలో పోసిన డీజిల్‍ బిల్లులకు అతీగతి లేదు.  దీంతో జిల్లాలోని పోలీస్‍ ఉన్నతాధికారులు పెట్రోల్‍ బంక్‍ యజమానులను రెక్వెస్ట్ చేస్తూ పెట్రోలింగ్​వాహనాల్లో డీజిల్ ​పోయించుకుంటున్నట్లు చెప్తున్నారు. రెండు, మూడు నెలల పాటు బిల్లులు పెండింగ్‍లో ఉండటంతో బంక్‍ యజమానులు సైతం పోలీస్‍ వాహనాలకు డీజిల్​ పోసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని ఏరియాల్లో స్టేషన్‍కు వచ్చిన వారితోనే పోలీస్‍ వాహనాల్లో డీజిల్​పోయిస్తున్నట్లు తెలుస్తోంది. 

బ్లూకోల్ట్ లకూ కోత...
సిటీ, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే చేరుకొనే బ్లూకోల్ట్ సిబ్బందికీ పెట్రోల్‍ లో కోత విధించారు. గతంలో సిటీల్లో నెలకు 40లీటర్లు ఇస్తుండగా ప్రస్తుతం 30 లీటర్లకు తగ్గించారు. పెట్రోల్​లో కోత విధించడంతో సిబ్బంది సైతం నామమాత్రంగానే డ్యూటీ ముగిస్తున్నారు. రూరల్ ఏరియాల్లో 20 లీటర్లు ఇస్తుండగా ప్రస్తుతం10 లీటర్లే ఇస్తున్నారు. దీంతో స్టేషన్ లో ఉండే రెండు వెహికిల్స్ లో ఒక్కదానికే పెట్రోల్​పోసి నడిపిస్తున్నారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజల శాంతి భద్రతలకు భంగం కలుగుతోందన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసులకు జీతాల్లో 15శాతం అలవెన్స్ ఇచ్చేది. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం లేదంటూ జీతాల్లోనూ ఆ 15శాతం కోత విధించారు. అందరి నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.