చమురుపై విండ్​ ఫాల్​ ట్యాక్స్​ తగ్గింపు

చమురుపై విండ్​ ఫాల్​ ట్యాక్స్​ తగ్గింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గుతుండటంతో దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుతోపాటు, డీజిల్, ఏటీఎఫ్​ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​) ఎగుమతిపై విధించే విండ్‌‌‌‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌‌‌‌ను ప్రభుత్వం తగ్గించింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్​జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ. 2,100 నుంచి రూ. 1,900 కు తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భూమి నుంచి, సముద్రం నుంచి తీసిన ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ ఏటీఎఫ్​ వంటి ఇంధనాలుగా మార్చుతారు. డీజిల్ లీటరుపై రూ. 6.5 నుంచి రూ. 5కి, ఏటీఎఫ్​  విదేశీ ఎగుమతులపై లీటరుకు రూ. 4.5 నుంచి రూ. 3.5లకు విండ్​ఫాల్​ ట్యాక్స్​ను కేంద్రం తగ్గించింది. కొత్త పన్ను రేట్లు జనవరి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. 2022 జూలై నుంచి విండ్‌‌‌‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌‌‌‌ వసూలు చేస్తున్నారు. అప్పటి నుంచి దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురుపై ట్యాక్స్​ను రెండుసార్లు తగ్గించారు. 2022 డిసెంబర్​లోనూ దీనిని తగ్గించారు. 

ఈ నెల మూడున ధరల్లో మార్పు

గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరల్లో పెరుగుదల కారణంగా జనవరి 3న జరిగిన సమావేశంలో పన్ను రేట్లను పెంచారు. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో విండ్‌‌‌‌ఫాల్ పన్నును తగ్గించాల్సి వచ్చింది. ఇంధన కంపెనీల సూపర్ నార్మల్ లాభాలపై పన్ను విధించే దేశాలలో ఇండియా కూడా చేరింది. మొదట పెట్రోల్,  ఏటీఎఫ్​పై లీటరుకు రూ. 6 (బ్యారెల్‌‌‌‌కు 12 డాలర్లు) చొప్పున, డీజిల్‌‌‌‌పై లీటరుకు రూ. 13 (బ్యారెల్‌‌‌‌కు 26 బ్యారెల్‌‌‌‌కు డాలర్లు) చొప్పున ఎగుమతి సుంకాలు విధించారు. దేశీయ ముడి ఉత్పత్తిపై టన్నుకు రూ. 23,250 (బ్యారెల్‌‌‌‌కు  40 డాలర్లు) చొప్పున విండ్‌‌‌‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ కూడా వసూలు చేశారు. పెట్రోల్‌‌‌‌పై ఎగుమతి పన్ను మొదటి సమీక్షలోనే రద్దు చేశారు. గడచిన రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లను మార్చుతారు. గుజరాత్‌‌‌‌లోని జామ్‌‌‌‌నగర్‌‌‌‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్‌‌‌‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్​తోపాటు, రోస్‌‌‌‌నెఫ్ట్ (రష్యా) మద్దతు గల నయారా ఎనర్జీ మనదేశం నుంచి ఎగుమతి చేస్తున్న ప్రైవేటు కంపెనీలు. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌‌‌‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందుతూ లాభాలు సంపాదిస్తే విండ్‌‌‌‌ఫాల్ ట్యాక్స్​ వర్తిస్తుంది.