ఎల్​ఐసీ ఐపీఓకు మే వరకు టైమ్‌

ఎల్​ఐసీ ఐపీఓకు మే వరకు టైమ్‌
  •     త్వరలో ప్రైస్​బ్యాండ్​ను ప్రకటించే అవకాశం
  •     యుద్ధంపై అలర్ట్​గా ఉన్నామన్న అధికారులు

న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఎల్​ఐసీ తన ఐపీఓను మొదలుపెట్టడానికి ఈ ఏడాది మే 12 వరకు గడువు ఉందని మార్కెట్​ వర్గాలు తెలిపాయి. మరోసారి డాక్యుమెంట్లను అందజేయకుండానే ఆలోపు పబ్లిక్​ ఇష్యూను తీసుకురావచ్చు. లేకపోతే డిసెంబర్ క్వార్టర్​ ఫలితాలను ఇచ్చాక సెబీకి ఎల్‌‌ఐసి తాజాగా పత్రాలను ఇవ్వాలి. నిజానికి ఎల్​ఐసీ ఐపీఓ ఈ నెలలోనే రావాల్సి ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల మార్కెట్‌లో అతలాకుతలం రావడంతో కేంద్రం వెనుకడుగు వేసింది. ప్రభుత్వం ఫిబ్రవరి 13న ఐపీఓ కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ)ని   దాఖలు చేసింది. "సెబీకి దాఖలు చేసిన పేపర్ల ఆధారంగా ఐపీఓని ప్రారంభించడానికి మాకు మే 12 వరకు గడువు ఉంది.  ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా గమనిచూస్తున్నాం. త్వరలోనే  ఆర్​హెచ్​పీని ఫైల్ చేస్తాం. త్వరలో ప్రైస్ బ్యాండ్ ప్రకటిస్తాం" అని ఒక ఆఫీసర్​ తెలిపారు. సెబికి దాఖలు చేసిన డిఆర్‌‌హెచ్‌‌పిలో ఎల్‌‌ఐసి ఆర్థిక ఫలితాలు,  సెప్టెంబర్ 2021 వరకు పొందుపరిచిన వాల్యుయేషన్​ వివరాలు ఉన్నాయి. అంతర్జాతీయ యాక్చురియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ రిపోర్టు ప్రకారం.. సెప్టెంబరు 30, 2021 నాటికి ఎల్​ఐసీ లోని కన్సాలిడేటెడ్​ షేర్​హోల్డర్ల వాల్యూ  సుమారు రూ.5.4 లక్షల కోట్ల వరకు ఉంది. డీఆర్​హెచ్​పీ ఎల్​ఐసీ  మార్కెట్ వాల్యుయేషన్‌‌ను వెల్లడించనప్పటికీ,  ఇది ఎంబెడెడ్​ వాల్యూ కంటే దాదాపు 3 రెట్లు ఉంటుంది.