ట్రైడెంట్ ఫర్ సేల్..చెరుకు రైతులకు రూ.7.38 కోట్లు బాకీ

ట్రైడెంట్ ఫర్ సేల్..చెరుకు రైతులకు రూ.7.38 కోట్లు బాకీ
  •     చెరుకు రైతులకు రూ.7.38 కోట్లు బాకీ
  •     రైతుల విజ్ఞప్తులు పట్టించుకోని యాజమాన్యం
  •     అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందించని ఫ్యాక్టరీ ఓనర్స్
  •     ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైన అధికారులు

సంగారెడ్డి, వెలుగు : చెరుకు రైతుల బకాయిలు చెల్లించని జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని వేలం వేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు బాకీపడిన రూ.7.38 కోట్లు చెల్లించాలని అధికారులు సూచించినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగానికి ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కొత్తూర్ (బి) వద్ద ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య వైఖరిపై రైతులు ఆందోళన చెందుతుండగా, అధికారులు ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి రైతుల బాకీలు చెల్లించేందుకు నిర్ణయించారు.

ఇప్పటికే 7 (ఏ) నోటీసులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేఎన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు నుంచి ప్రతి ఏడాది సమస్యలు తలెత్తుతుండడంతో జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత సీజన్ లో క్రషింగ్ కూడా మొదలు పెట్టకపోవడంతో ఫ్యాక్టరీ కొనసాగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం కూడా ఫ్యాక్టరీని నడిపే ఆలోచనతో లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ముందస్తుగా నోటీసులు ఇచ్చి నిబంధనలకు అనుగుణంగా ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

నాలుగేళ్లుగా సమస్య..

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన నాలుగేళ్ల నుంచి రైతులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పండించి పంటను ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు కానీ తర్వాత బిల్లులు రాబట్టుకోవడం వారికి పెద్ద సమస్యగా మారింది. గత సీజన్ కు ట్రైడెంట్ ఫ్యాక్టరీలో 3 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ చేశారు. టన్నుకు రూ.3,270 చొప్పున ధర నిర్ణయించగా రూ.69 కోట్ల బిల్లులు దశలవారీగా చెల్లించారు. ఇందులో టన్నుకు రూ.3 వేలు మాత్రమే చెల్లించి మిగతా రూ.270 చొప్పున బాకీ పడిన రూ.7.38 కోట్లు ఇవ్వాల్సి ఉంది. బాకీ ఇవ్వకపోగా ఫ్యాక్టరీ తెరిచి క్రషింగ్ మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై అధికారులు యాక్షన్ కు దిగుతున్నారు.

22 వేల ఎకరాల్లో..

జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఈసారి 22 వేల ఎకరాల్లో చెరుకు పంట వేశారు. ఇందులో 8 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితులు ఉన్నందున రాష్ట్రంలోని ఇతర ఫ్యాక్టరీలకు చెరుకు పంటను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. అయితే జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరుకు పంటకు అనువైన నెలలు ఉండడం వల్ల మ్యాగ్జిమం రైతులు చెరుకు వేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరికి ప్రతి సీజన్ లో క్రషింగ్ సమస్యలు తలెత్తుతుండగా ఆపై బిల్లులు పొందడం సవాల్ గా మారుతోంది.

నోటీసులు ఇచ్చాం

చెరుకు రైతుల సంక్షేమం కోరుతూ ట్రైడెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించబోతున్నాం. చెరుకు రైతులు అధైర్య పడొద్దు. ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మేసి బాకీలు చెల్లించేలా చూస్తాం. ఈ సీజన్ లో పండించిన చెరుకు పంటను రాష్ట్రంలోని ఇతర చెరుకు ఫ్యాక్టరీలకు తరలించి బిల్లులు సకాలంలో అందించేలా చేస్తాం. 

రాజశేఖర్, (కేన్ అసిస్టెంట్ కమిషనర్) (వాయిస్)

బిల్లులు ఇస్తలేరు (వాయిస్)

చెరుకు బిల్లుల చెల్లింపుల్లో ట్రైడెంట్ ఫ్యాక్టరీ రైతులను ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్ లో దాదాపు 300 టన్నుల చెరుకును ఫ్యాక్టరీకి తరలించాను. టన్నుకు రూ.270 చొప్పున ఇంకా లక్ష రూపాయలు రావాల్సి ఉంది. ఫ్యాక్టరీ, అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. నా మాదిరిగా చాలామంది రైతులు ఉన్నారు. ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి అయినా సరే బకాయిలను చెల్లించేలా చూడండి. 

మల్లయ్య, (చెరుకు రైతు, కొత్తూర్)