
- ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- విలీనంతో పెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలని యోచన
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ కలిపేసి, న్యూ ఇండియా అస్యూరెన్స్ కింద మెగా జనరల్ ఇన్సూరర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం… తాజాగా మరో కొత్త ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలలో వాటాలను విక్రయించాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే డిపార్ట్‌మెంట్ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్‌లు వాటాల విక్రయం కోసం పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నాయి. గత రెండేళ్లుగా పెండింగ్ పడిన ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వాటాల విక్రయాన్ని వేగిరంగా చేపడుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్ వాటాల అమ్మకానికి షేర్లను జారీ చేయడం లేదా డైరెక్ట్‌గా న్యూ ఇండియా అస్యూరెన్స్‌కు వాటాలు అమ్మేయడం.. ఈ రెంటింటో ఏదో ఒక దానిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మెగా ఇన్సూరెన్స్ కంపెనీ
ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అవి న్యూ ఇండియా అస్యూరెన్స్, మిగతా మూడు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియెంట్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. దీనిలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే లిస్టెడ్ కంపెనీ. గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన మాదిరి కాకుండా.. నాలుగు కంపెనీలను విలీనం చేసేసి, ఎల్‌ఐసీ మాదిరి జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్‌లో కూడా మెగా ఇన్సూరర్‌ను ప్రభుత్వం సృష్టించాలనుకుంటోంది. ఒక్కసారి విలీనం పూర్తయితే, ఇక వెంటనే పెద్ద మొత్తంలో వాటాల విక్రయానికి వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ విలీన ప్రక్రియ పూర్తవడం కోసం ఓ కన్సల్టెంట్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీల కన్సాలిడేషన్, ప్రభుత్వ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలో ఒక భాగమని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 వేల కోట్ల డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.85,045 కోట్ల డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ చేపట్టింది. 2018–19 బడ్జెట్‌లో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని కలిపేయాలని ప్రతిపాదించింది. అయితే పలు కారణాల వల్ల ఈ విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కంపెనీల బలహీనమైన ఫైనాన్సియల్ హెల్త్ కూడా విలీనం ప్రక్రియ పూర్తికాకపోవడానికి ప్రధాన కారణం. ఈ ప్రభుత్వ రంగ కంపెనీల్లో రెండు ఇన్సూరర్స్ సాల్వెన్సీ రేషియోను నిర్వహించడానికి కూడా ఇబ్బందిపడుతున్నాయి.