పరామర్శలే తప్ప.. పరిహారమిస్తలే.. మూడేండ్లుగా ఇదే పరిస్థితి

పరామర్శలే తప్ప.. పరిహారమిస్తలే.. మూడేండ్లుగా ఇదే పరిస్థితి
  • ఏటా 15లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వని రాష్ట్ర సర్కార్​
  • కేంద్రానికి పంట నష్టం నివేదికలు
  • పంపడంలోనూ నిర్లక్ష్యం
  • ఏడాది కిందటి పరిహారం చెక్కులు ఇప్పుడిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు 
  • తక్షణ పరిహారం ఇస్తున్నట్లు హడావుడి

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలు, ‌‌వడగండ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం మూడేండ్లుగా ఆదుకోవడం లేదు. పంట నష్టం జరిగినప్పుడు.. ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శల పేరిట హడావుడి చేయడం తప్ప పైసా ఇవ్వడం లేదు.వానా కాలంలో తుఫాన్లు, వరదలు, జనవరి – ఏప్రిల్​లో వడగండ్లతో ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాల పంట నీటిపాలవుతున్నది. మూడేండ్లలో 8సార్లు పంట నీట మునగడంతో రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ‌‌రాష్ట్రంలో ఎలాంటి బీమా స్కీం అమలు చేయకపోవడం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

రైతు బంధు ఇచ్చి.. ఇన్​పుట్ సబ్సిడీ నిలిపివేత

2020–21లో విపత్తుల నిర్వహణ కింద కేంద్రం రూ.595 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వాటా కలిపితే ఆ మొత్తం రూ.978 కోట్లు ఉంది. ఇన్​పుట్​ సబ్సిడీ కింద రూ.188 కోట్లు వాడుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయినా నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కార్​ ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వలేదు. చట్టం ప్రకారం 33% పంట నష్టపోతే విపత్తుల సహాయ నిధి నుంచి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించగా.. తాము రైతుబంధు ఇస్తున్నందున ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 2020 నుంచి పంటల బీమా లేకపోవడంతో రైతులకు పరిహారం అందడం లేదు. పీఎం ఫసల్‌‌ బీమా యోజన స్కీమ్​ను ‌‌అమలు చేయకపోగా.. ఇది పనికిరాదంటూ ప్రభుత్వ పెద్దలే ప్రచారం చేశారు.

తొమ్మిదేండ్లుగా వెంటాడుతున్న అతివృష్టి

తొమ్మిదేండ్లుగా వానలు బాగా కురుస్తున్నాయి. అనావృష్టి బాధ తప్పినా అతివృష్టి వెంటాడుతున్నది. ప్రతి ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నది. 2020 సెప్టెంబర్, అక్టోబర్‌‌ నెలల్లో 18 జిల్లాల్లో 2.04 లక్షల హెక్టార్లలో వరి, 3.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది. నిరుడు జనవరిలో సంక్రాంతికి ముందు కురిసిన అకాల వర్షాలకు 34వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల, నర్సంపేట ఏరియాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులను పరామర్శించి వెళ్లారు. ఏడాది దాటినా పరిహారం మాటెత్తలేదు. మూడు, నాలుగు రోజులుగా అప్పటి పరిహారపు చెక్కులను ఇప్పుడు ఇస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు హడావుడి చేస్తున్నారు. నిరుడు జులై, ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్​ జిల్లాలో తీవ్రంగా నష్టపోయాయి.‌‌

నష్టం వివరాలు కేంద్రానికి పంపని రాష్ట్ర సర్కార్

భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను కేంద్రానికి పంపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. నిరుడు వరదలతో నష్టపోయిన 10 రాష్ట్రాల నుంచి కేంద్రానికి నివేదికలందాయి. తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. జులైలో జరిగిన పంట నష్టం రిపోర్ట్ ను నిరుడు నవంబర్ దాకా రాష్ట్ర ప్రభుత్వం తమకు పంపలేదని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌‌ కొండల్ రెడ్డి వేసిన ఆర్టీఐ అప్లికేషన్ కు కేంద్రం రిప్లై ‌‌ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా వరద నష్టం వివరాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తున్నదని, పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ (పీడీఎన్ఏ)లో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నేషనల్ డిజాస్టర్ మేనేజేమెంట్ అథారిటీ (ఎన్ డీఎంఏ) తన రిప్లైలో పేర్కొంది. 

మూడేండ్లుగా పంట బీమా లేదు

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం.. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సీజన్​లో ఇన్​పుట్ సబ్సిడీ కింద పరిహారం అందజేయాలి. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తప్పా ఇన్‌‌పుట్ సబ్సిడీ కింద ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రధాన మంత్రి ఫసల్‌‌ బీమా యోజన స్కీమ్ ను 2020 నుంచి రాష్ట్రంలో అమలు చేయడం లేదు. దేశంలో ఏపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్ లో ఈ స్కీమ్ అమలు చేయకపోయినా తమ సొంత బీమాలను అమలు చేస్తున్నారు. ‌‌కా‌‌నీ, తెలంగాణ మాత్రం ఎలాంటి బీమా స్కీమ్​ను ప్రకటించ లేదు. ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేల దాకా నష్టపోతున్నా ఒక్క రూపాయి కూడా సర్కారు నుంచి సాయం అందడం లేదు.

భారంగా మారిన సాగు

సాగు చేసిన పంట చేతికందక, సర్కార్ సాయం చేయక, అప్పులు తీర్చే మార్గం లేక రాష్ట్రంలో ప్రతి రోజూ ఒకరిద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలో కౌలు రైతులే ఎక్కువగా ఉంటున్నారు. పంట పెట్టుబడులకు తోడు పిల్లల చదువులు, వారి పెండ్లిళ్లు, వైద్యం ఇతరత్రా ఖర్చులు కూడా కలిసి రుణ భారం తడిసిమోపెడవుతున్నది. లక్షల్లో అప్పులు తెచ్చి సాగుచేస్తున్నా పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదు. ఈసారి పత్తికి మంచి రేటు ఉన్నా.. వర్షాలతో పూర్తిగా పంట దెబ్బతిని దిగుబడి పడిపోయింది.