అధ్వాన్నంగా సన్​ ఫ్లవర్​ రైతుల పరిస్థితి

అధ్వాన్నంగా సన్​ ఫ్లవర్​ రైతుల పరిస్థితి

మెదక్ (నిజాంపేట), వెలుగు : వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా రైతులు ఉత్పత్తులు అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం మెదక్​ జిల్లాలో సన్​ ఫ్లవర్​ రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. మెదక్​ జిల్లాలో రైతులు పంట మార్పిడి చేయాలని, ఆరుతడి పంటలను సాగు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు సూచించగా యాసంగి సీజన్​లో వివిధ మండలాల పరిధిలో  రైతులు 279 ఎకరాల్లో సన్ ఫ్లవర్ పంటను వేశారు. అక్టోబర్ నెల చివరిలో, నవంబర్ మొదటి వారంలో వేసిన పంట ప్రస్తుతం కోతలు షురూ అయ్యాయి.

జిల్లా వ్యాప్తంగా సుమారు 1,700 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో వేరే జిల్లాలకు వెళ్లలేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సన్ ఫ్లవర్ పంటకు క్వింటాలుకు రూ.6,600  ఎంఎస్ పీ ప్రకటించింది. కానీ బహిరంగ మార్కెట్ లో వ్యాపారులు క్వింటాలుకు రూ.4,700 నుంచి రూ.5,000 మాత్రమే  ఇస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

జల్ది సెంటర్లు పెట్టాలే.. 

సర్కారు చెప్పిందని ఈసారి ఆరుతడి పంటగా పొద్దుతిరుగుడును సాగు చేసినం. కానీ ఇప్పుడు గింజలను అమ్ముకునేందుకు మస్తు తిప్పలైతుంది. ఏం చేయాల్నో దిక్కుతోస్తలే.. సర్కారు జల్ది సెంటర్లు పెట్టి పొద్దుతిరుగుడు గింజలు కొనాలే..

– కొత్తోల్ల నర్సింలు, రైతు, చల్మెడ