
వేములవాడ, వెలుగు : ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి పెట్టాల్సిందేనని, కేటీఆర్‌కు ఎందుకంత నామోషీ అని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ఫైర్ అయ్యారు. మంగళవారం వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఫొటో సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఉండాలని అడగడంలో తప్పు లేదన్నారు.
క్యాంపు ఆఫీస్ అంటే అధికారిక కార్యక్రమాలకు కేటాయించిందని, అది కేటీఆర్ సొంత ఆఫీస్ కాదన్నారు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోకపోతే ఈ సారి సిరిసిల్ల క్యాంపు ఆఫీసును కూడా ప్రజలు ఖాళీ చేయిస్తారన్నారు. తమ కార్యకర్తలు ప్రశ్నిస్తే సహించలేక బీఆర్ఎస్ నాయకులే దౌర్జన్యానికి దిగారన్నారు. హౌసింగ్ పీడీ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల ప్రత్యేక అధికారులు శ్రీనివాస్, లక్ష్మీరాజ్యం, లీడర్లు వకుళాభరణం శ్రీనివాస్, సోయినేని కరుణాకర్, వెంకటేశ్ పాల్గొన్నారు.