Graeme Cremer: ఇలాంటివి జింబాబ్వే వాళ్ళకే సాధ్యం: ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రీమర్

Graeme Cremer: ఇలాంటివి జింబాబ్వే వాళ్ళకే సాధ్యం: ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రీమర్

సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి రావడం జింబాబ్వే వాళ్ళకే కుదురుతుందేమో. ఇటీవలే బ్రెండన్ టేలర్ 42 నెలల నిషేధం తర్వాత పునరాగమనం చేస్తే.. తాజాగా గ్రేమ్ క్రీమర్ ఏడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. 39 ఏళ్ల ఈ  లెగ్ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు. అక్టోబర్ 29 నుంచి హరారేలో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. క్రీమర్ చివరిసారిగా 2018లో జింబాబ్వే తరపున ఆడాడు. మళ్ళీ ఏడేళ్ల విరామం తర్వాత స్క్వాడ్ లో చోటు సంపాదించుకున్నాడు. 

గ్రేమ్ క్రీమర్ 2018లో జింబాబ్వే జట్టును వీడి గోల్ఫ్ ను తన ప్రొఫెషనల్ కెరీర్ గా ఎంచుకున్నాడు. క్రికెట్ కు చాలా కాలం దూరంగా ఉన్న అతను యుఎఇకి మకాం మార్చాడు. అక్కడ అతని భార్య మెర్నా ఎయిర్‌లైన్ పైలట్‌గా పనిచేస్తున్నారు. క్రికెట్ పై ఇష్టంతో ఇటీవల జింబాబ్వేకు తిరిగి వచ్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించడంతో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 2026 టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ సీనియర్ ప్లేయర్ జట్టులో చేరడం ఆ జట్టుకు కలిసి రానుంది. బృందం టేలర్ కూడా జట్టులోని ఉండడంతో టీ20 వరల్డ్ కప్ కు జింబాబ్వే జట్టు ఆసక్తికరంగా మారింది. 

శుక్రవారం (అక్టోబర్ 24) ఒక అధికారిక ప్రకటనలో జింబాబ్వే క్రికెట్ సెలెక్టర్లు మాట్లాడుతూ.. క్వాలిఫయర్స్ అంతటా ఓటమి లేకుండా నిలిచిన జింబాబ్వే జట్టును సెలక్ట్ చేశామని.. క్రీమర్ ను మాత్రమే జట్టులోకి తీసుకున్నారని ధృవీకరించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ ట్రెవర్ గ్వాండు స్థానంలో క్రీమర్ జట్టులోకి వచ్చాడు. సీనియర్ ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్ వ్యక్తిగత కారణాల వలన సిరీస్ కు అందుబాటులో ఉండడం లేడని బోర్డు స్పష్టం చేసింది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ అక్టోబర్ 29న, రెండు, మూడు టీ20లు వరుసగా అక్టోబర్ 31, నవంబర్ 2న జరుగుతాయి.

ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు జింబాబ్వే జట్టు: 

సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెసింగ్ ముజారబానీ, మేయర్స్, అంగారవ, బ్రెండన్ టేలర్