పల్లెల్లో పంచాయితీ.. గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు

పల్లెల్లో పంచాయితీ.. గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు

మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రచారంలో భాగంగా మాటా మాట పెరిగి కొందరు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల తమకు పక్కవారే ఓటు వేయలేదన్న కక్షతో, గెలిచిన వారికి మద్దతు ఇస్తున్నారన్న కోపంతో మరికొందరు దాడులకు దిగుతున్నారు.

చెరువు కొమ్ముతండాలో ఇరువర్గాల బాహాబాహీ

నర్సంపేట, వెలుగు : వరంగల్‌‌ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ముతండాలో ఇరువర్గాల నాయకులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి చలి మంట కాగుతున్నారు. ఇదే టైంలో మరో వర్గానికి చెందిన వారు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌‌గా గెలిచే క్యాండిడేట్‌‌ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడుల్లో ఆరుగురికి గాయాలు కావడంతో నర్సంపేట హాస్పిటల్‌‌కు తరలించారు. గాయపడిన బోడతండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు బోడ రెడ్డి, వెంకన్న, శ్రీను, ప్రసాద్, శ్రీనివాస్‌‌ను నర్సంపేట హాస్పిటల్‌‌లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి పరామర్శించారు. ఇరువర్గాలకు చెందిన 20 మందిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై జి.రాజేశ్‌‌రెడ్డి తెలిపారు.

ఇండిపెండెంట్‌‌ సర్పంచ్‌‌ క్యాండిడేట్‌‌పై కత్తితో దాడి

పరిగి, వెలుగు : ఇండిపెండెట్‌‌గా పోటీ చేస్తున్న ఓ సర్పంచ్‌‌ క్యాండిడేట్‌‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్‌‌ జిల్లా దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై వసంత్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బండి అర్జున్‌‌ సర్పంచ్‌‌ పదవి కోసం ఇండిపెండెంట్‌‌గా పోటీ చేస్తున్నాడు. సోమవారం రాత్రి అర్జున్‌‌ తన ఇంటికి వెళ్తూ.. బీసీ కాలనీ వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో అర్జున్‌‌ కడుపులో పొడిచాడు. అర్జున్‌‌ గట్టిగా అరవడంతో గమనించిన గ్రామస్తులు అతడిని పరిగి హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. 

ఇరువర్గాల మధ్య దాడి..

దహెగాం, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్‌‌ క్యాండిడేట్‌‌ భర్త, వార్డు సభ్యుల క్యాండిడేట్ల మధ్య గొడవ జరగడంతో గొడ్డలి, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా దహెగాం మండలంలోని బోర్లకుంటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన, సర్పంచ్‌‌గా పోటీ చేసి ఓడిపోయిన రత్నం లలిత భర్త సుధాకర్, వార్డు సభ్యుడిగా గెలిచిన జుమిడి శంకర్‌‌ మధ్య మాటామాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. కాగా, గెలిచిన సర్పంచ్‌‌కు మద్దతు ఇచ్చానన్న కోపంతో సుధాకర్‌‌ కత్తిపీటతో దాడికి యత్నించాడని శంకర్‌‌ ఆరోపించగా.. శంకరే తనపై కారం చల్లి కత్తి, గొడ్డలితో దాడి చేశాడని సుధాకర్‌‌ చెప్పారు.

ఓటు వేయలేదన్న కోపంతో తల్లీకూతుళ్లపై దాడి

శంకరపట్నం, వెలుగు : తనకు ఓటు వేయలేదన్న కోపంతో ఓడిన వార్డు సభ్యురాలి కుటుంబ సభ్యులు తల్లీకూతుళ్లపై దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మొలంగూరులోని ఎనిమిదో వార్డు క్యాండిడేట్‌‌గా ఖమరున్నీసా పోటీ చేసి ఓడిపోయింది. దీంతో పక్కింట్లో ఉండే వారే తనకు ఓటు వేయలేదని ఆగ్రహానికి గురైన ఖమరున్నీసా మంగళవారం తన కూతురు యాస్మిన్‌‌, కొడుకు హకీంతో కలిసి దాసరి పద్మ, ఆమె కూతుళ్లు ప్రియాంక, మౌనికపై దాడి చేసింది. దీంతో బాలింత అయిన ప్రియాంక స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు ప్రియాంకను 108లో హుజూరాబాద్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు.