చేవెళ్ల, వెలుగు:సర్పంచ్ ఎన్నికలకు జిల్లాల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో తొలి రోజు 145 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి విడతలో 174 స్థానాలకు, 1,530 వార్డు స్థానాలకు డిసెంబర్11న ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ,145 మంది సర్పంచ్ అభ్యర్థులు, 119 మంది వార్డుల అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
సర్పంచ్ స్థానాలకు సంబంధించి అత్యధికంగా ఫరూక్ నగర్ మండలంలో 34 , అత్యల్పంగా కొత్తూరులో11 నామినేషన్లు వేయగా.. చౌదరి గూడలో 30, కేశంపేటలో 24, కొత్తూరులో 11, కొందుర్గులో 13, నందిగామలో 16, శంషాబాద్ లో 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు స్థానాలకు సంబంధించి శంషాబాద్ మండలంలో అత్యధికంగా 31 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, అత్యల్పంగా చౌదరిగూడలో 5 నామినేషన్లు దాఖలయ్యాయి.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో 262 పంచాయతీలు, 2,198 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, తొలిరోజు సర్పంచులకు 162 నామినేషన్లు, వార్డు సభ్యులకు 87 నామినేషన్లు దాఖలయ్యాయి. మండల వారీగా చూస్తే తాండూరులో 24 మంది, బషీరాబాద్‌లో 25 మంది, యాలాలలో 29 మంది, పెద్దేముల్లో 27 మంది, కొడంగల్‌లో 18 మంది, దౌల్తాబాద్‌లో 22 మంది, బొంరాస్ పేటలో 7 మంది, దుద్యాలలో 10 మంది సభ్యుల సర్పంచ్ స్థానాలకు నామినేషన్ వేశారు.
అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ పంచాయతీల వారీగా నామినేషన్ల కోసం కౌంటర్లను ఏర్పాటు చేసి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించారు.
