- గ్రామ పాలకవర్గాలు లేని కాలంలో పేమెంట్స్ చేసిన సెక్రటరీలు
- ఒక్కో సెక్రటరీకి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పెండింగ్
కరీంనగర్, వెలుగు : గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు లేని కాలంలో పంచాయతీ సెక్రటరీలు పెట్టిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు మంజూరు కావడం లేదు. పాలకవర్గాలు లేని రెండేండ్లలో సెక్రటరీలు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు చేసిన పేమెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 5 వేల లోపు ఓచర్ పేమెంట్స్, ఎంబీ రికార్డు చేసిన పనులకు ఎస్టీఓలో అప్రూవల్ అయి టోకెన్ నంబర్ వచ్చినప్పటికీ.. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ‘వెయిటింగ్ ఫ్రం గవర్నమెంట్’ అని కనిపిస్తోంది. దీంతో బిల్లుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సెక్రటరీలు తలలు పట్టుకుంటున్నారు.
పాలకవర్గాలు లేని కాలంలో ప్రజలకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, స్ట్రీట్ లైట్స్ వంటి నిత్యావసరాల కోసం అప్పులు తీసుకొచ్చి పెట్టామని, తీరా ఇప్పుడు తమ బిల్లులు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిల్లుల విడుదలలో జాప్యం..
రాష్ట్రంలోని గత సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 2తో ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2025 డిసెంబర్ చివర్లో పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టారు. పాత సర్పంచ్ల పదవీ కాలం ముగిసి, కొత్త సర్పంచ్‌లు వచ్చే వరకు 23 నెలల పాటు గ్రామపంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. అయినప్పటికీ గ్రామపాలనకు సంబంధించిన ఖర్చుల భారం పంచాయతీ సెక్రటరీల మీదే పడింది.
పాలకవర్గాలు లేని కారణంగా కేంద్రం నుంచి 15వ ఫైనాన్స్ నిధులు కూడా మంజూరు కాలేదు. దీంతో బోరు, బావి మోటార్లు కాలిపోయినా, ట్రాక్టర్ల రిపేర్లు, డీజిల్, గ్రామసభల్లో చాయ్, బిస్కట్లు, బతుకమ్మ, బోనాలు, పంద్రాగస్టు, జనవరి 26 వంటి వేడుకల సమయంలో టెంట్లు, కుర్చీల కిరాయిలు, వాటర్ పైప్‌లైన్ లీకేజీలకు రిపేర్లు, శానిటేషన్‌కు సంబంధించి మినిమం మెయింటెనెన్స్ కోసం అవసరమైన డబ్బులను సెక్రెటరీలే ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఒక్కో పని కోసం రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఓచర్ పేమెంట్స్ చేశారు. ఇలా ఒక్కో కార్యదర్శి మొత్తం రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంటి పన్నులు వసూలు చేసి ట్రెజరీలో జమ చేశాక.. తాము పెట్టిన ఖర్చులకు చెక్ జనరేట్ చేస్తే ట్రెజరీ నుంచి టోకెన్ నంబర్ వచ్చినా.. ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాకపోవడంతో పంచాయతీ సెక్రటరీల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు.
బిల్లులు త్వరగా మంజూరు చేయాలి
సర్పంచ్‌లు లేని కాలంలో పంచాయతీ సెక్రటరీలే అన్ని ఖర్చులను భరించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో పాస్ అయినప్పటికీ.. ప్రభుత్వం నుంచి నిధులు జమ కాకపోవడంతో సెక్రటరీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సెక్రటరీల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రెజరీలో పెండింగ్ ఉన్న చెక్కులు క్రెడిట్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– మధుసూదన్‌రెడ్డి, టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు -
