పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం

పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం

తెలంగాణ సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది బతుకమ్మ పండుగ. పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం ఉన్న ఈ పండుగ తెలంగాణ ప్రజల బతుకు పండుగ. ఊరూ, వాడా ఏకమై కన్నుల పండువగా తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడ చూసినా రంగు రంగుల పూలతో చేసిన బతుకమ్మలు, వాటిచుట్టూ ఆడిపాడే మహిళలతో ఊరూ వాడా సందడిగా కనిపిస్తాయి. భాద్రపద అమావాస్య రోజున మొదటిరోజు అంటే నిన్న (25, ఆదివారం) ఎంగిలిపూల బతుకమ్మతో  మొదలైన సంబురాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి అంటే రెండవరోజు అటుకుల బతుకమ్మగా గౌరమ్మను పూజిస్తారు. తంగేడు , గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలతో బతుకమ్మను అందంగా పేర్చి శిఖరంపై గౌరమ్మను ఉంచుతారు. ఉదయం పూజలు చేసి, సాయంత్రం చిన్నా పెద్దా చేరి ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ అంటూ ఆడి, పాడి చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత అటుకులు వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు. బతుకమ్మకు నైవేద్యంగా  చప్పిడి పప్పు,  బెల్లం, అటుకులు పెడతారు. 

ప్రసాదం కావాల్సినవి: అటుకులు ఒక కప్పు, బెల్లం ముప్పావు కప్పు, డ్రై ఫ్రూట్స్‌‌ కొన్ని, నెయ్యి కొంచెం

తయారీ: కడాయిలో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్‌‌ వేగించాలి. అదే కడాయిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కరిగించాలి. అటుకులను నీళ్లలో తడిపి బెల్లం పాకంలో వేసి కలపాలి. చివర్లో డ్రై ఫ్రూట్స్‌‌ వేయాలి. ఈ అటుకుల ప్రసాదంతో పాటు చప్పిడి పప్పు కూడా నైవేద్యంగా పెడతారు.

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో గల్లీ గల్లీలో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను.. పసుపు, కుంకుమతో చేసిన గౌరమ్మలను ముంగిళ్లలో ఉంచి ఆడబిడ్డలు ఆడి పాడారు. వరంగల్​ వెయ్యి స్తంభాల గుడి వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో కూడా గవర్నర్​ తమిళిసై బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చి మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. ఇయ్యాల రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా అటుకుల బతుకమ్మ సంబురాలు జరుగనున్నాయి.