- ములుగులో జిల్లా కోర్టు నూతన భవనాలకు 1న శంకుస్థాపన
- 1993లో కోర్టులో బాంబు బ్లాస్ట్
- ఇన్నాళ్లూ అద్దెభవనంలో నడుస్తున్న జిల్లా కోర్టు
- కొత్త భవన శంకుస్థాపనకు హాజరుకానున్న నలుగురు హైకోర్టు జడ్జిలు
ములుగు, వెలుగు: ములుగు జిల్లా ప్రజలకు కొత్త కోర్టు భవన సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం గట్టమ్మ సమీపంలోని నూతన సమీకృత కలెక్టరేట్వద్ద 8 ఎకరాల స్థలం, రూ.83 కోట్లు కేటాయించింది. భవనాల నిర్మాణానికి నవంబర్ 1న నలుగురు హైకోర్టు పోర్టుపోలియో జడ్జిలు హాజరై శంకుస్థాపన చేయనున్నారు.
గతంలో ఇక్కడ ఉన్న కోర్టులో బాంబు బ్లాస్టులు చోటుచేసుకోగా, ఇన్నాళ్లూ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని కోర్టు భవన సముదాయాలు ఒకేచోట నిర్మాణం కావడంతో కక్షిదారులకు ఉపయోగంగా మారనుంది.
ఐదు నిమిషాల వ్యవధిలో రెండు బాంబు బ్లాస్టులు..
1993లో ములుగు కోర్టు భవనం స్థానికంగా నిర్మాణంలో ఉండగా, మరొకటి అద్దె భవనం కొనసాగుతోంది. సరిగ్గా 32 ఏండ్ల కింద రాత్రి 10.30 గంటలకు ఐదు నిమిషాల వ్యవధిలోనే ఒకటి తర్వాత మరొకటి రెండు కోర్టు భవనాలు బ్లాస్ట్ అయ్యాయి.
దీనికి కారణంగా నక్సల్ గ్రూప్ సభ్యులని అప్పటి పోలీసు అధికారులు నిర్ధారించారు. దీంతో నిర్మాణంలో ఉండి దెబ్బతిన్న భవనాన్నే పునరుద్ధరించి కోర్టు వ్యవహారాలను నిర్వహించారు. 25 ఏండ్ల తర్వాత ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో 2018లో అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు అద్దె భవనంలోకి మార్చారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2019 ఫిబ్రవరి 17 ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాగా, 2022లో జిల్లా కోర్టుగా అప్గ్రేడ్ అయ్యింది. రూ.లక్షా15 వేలు చెల్లిస్తూ కోర్టు వ్యవహారాలను అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు.
1న కొత్త భవనాలకు శంకుస్థాపన..
ములుగులో నూతన కోర్టు భవన సముదాయానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టమ్మ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్భవనానికి ఆనుకొని బండారుపల్లి శివారులోని 573 సర్వే నెంబరులో 8 ఎకరాల స్థలం కేటాయించింది. అందులో జిల్లా కోర్టుతోపాటు ఎన్డీపీఎస్, సీనియర్ సివిల్ కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు, అడిషనల్ కోర్టు, సెకండ్ క్లాస్ కోర్టు, జువైనల్ జస్టిస్ కోర్టు తదితర కోర్టులు నిర్వహించనున్నారు. ఈ కోర్టుల్లో కేటగిరీ వారీగా జడ్జిలు విధులు నిర్వస్తారు.
ఈ భవనాలన్నీ ఒకే సముదాలయంలో ఉండటంతో కక్షిదారులకు సౌకర్యవంతంగా మారనున్నది. కొత్త భవనాల శంకుస్థాపన నవంబర్ 1వ తేదీన చేయనుండగా, కార్యక్రమానికి హైకోర్టు పోర్టుపోలియో జడ్జి ఈ.వీ.వేణుగోపాల్, మరో ముగ్గురు జడ్జిలు నామవరపు రాజేశ్వర్రావు, బీఆర్మల్లేశం, సీ.చలపతిరావులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ములుగు జిల్లా జడ్జి సూర్యచంద్రకళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కక్షిదారులకు సేవలు విస్తృతం..
ములుగులో కొత్తగా నిర్మించనున్న కోర్టు భవన సముదాయంతో అన్నివిభాగాల కోర్టులు ఒకే దగ్గర నిర్వహిస్తారు. కొత్త భవనాల కోసం ప్రభుత్వం 8ఎకరాల స్థలం కేటాయించింది. కొత్త భవనాలు నిర్మిస్తే వస్తే మరిన్ని కోర్టులు అందుబాటులోకి వస్తాయి. కక్షిదారులకు సౌకర్యాలు సైతం మెరుగవుతాయి. కేసుల పరిష్కారం సైతం వేగవంతంగా జరుగనుంది. సీహెచ్.వేణుగోపాలాచారి, ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
