ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే (శుద్ధి) పండుగ బుధవారం ఘనంగా జరిగింది. సమ్మక్క గుడిలో పూజారులు కొక్కర కృష్ణయ్య, సిద్దమైన మునీందర్ ఆధ్వర్యంలో, కన్నేపల్లి సారలమ్మ గుడిలో కాక సారయ్య ఆధ్వర్యంలో గుడి మెలిగే పండుగను నిర్వహించారు. మహాజాతర ప్రారంభానికి సంకేతంగా ఈ గుడి మెలిగే పండుగను నిర్వహిస్తామని పూజారులు తెలిపారు.
పండుగలో భాగంగా బుధవారం తెల్లవారుజామునే అమ్మవార్ల ఆలయం వద్దకు చేరుకొని గుడిపైన ఉన్న పాత గడ్డిని తొలగించారు. తర్వాత అడవికి వెళ్లి కొత్త గడ్డిని తీసుకొచ్చి గుడిపై కప్పారు. అనంతరం గుడిలోని పూజా సామగ్రిని శుద్ధి చేసి, ఆలయం ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 21 మండ మెలిగే పండుగ జరగనుంది.
