కొత్త ఏడాదిలో రూ.3.52 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

కొత్త ఏడాదిలో రూ.3.52 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  • 929 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌
  • అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లోనే..

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరాన్ని ఓ రేంజ్‌‌‌‌లో స్టార్ట్ చేశాయి. బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లయిన సెన్సెక్స్‌‌, నిఫ్టీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌లు పాజిటివ్‌‌గా ముగిశాయి. దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, ఇన్వెస్టర్లు మాత్రం సోమవారం తెగ కొన్నారు. గ్లోబల్‌‌ మార్కెట్లు కూడా పాజిటివ్‌‌గా ఉండడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ సోమవారం 929 పాయింట్లు (1.6 శాతం) పెరిగి 59,183 వద్ద  క్లోజయ్యింది. నిఫ్టీ   272  పాయింట్లు (1.6 శాతం) ఎగిసి 17,626 వద్ద ముగిసింది. కంపెనీల డిసెంబర్‌‌‌‌ సేల్స్‌‌ మిశ్రమంగా ఉన్నా,  సోమవారం ఆటో షేర్లు  బాగా పెరిగాయి. సోమవారం ఒక్క సెషన్‌‌లోనే  ఇన్వెస్టర్ల సంపద రూ. 3.52 లక్షల కోట్లు పెరిగింది. దీంతో  బీఎస్‌‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌‌ క్యాప్ రూ. 269.52 లక్షల కోట్లకు చేరుకుంది. కాగా, కిందటి ఏడాదిలో సెన్సెక్స్ 10,502 పాయింట్ల  లాభపడగా, నిఫ్టీ 3,372 పాయింట్లు ఎగిసింది. 
ఎనలిస్టులు ఏమన్నారంటే..
‘దేశంలో వ్యాక్సిన్ వేసుకునేవాళ్లు పెరుగుతుండడంతో, కొత్త సంవత్సరంలోకి  బుల్స్‌‌ ఓ రేంజ్‌‌లో ఎంటర్ అయ్యాయి. సోమవారం ర్యాలీని నిఫ్టీ బ్యాంక్‌‌ ముందుండి నడపగా, అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌ల నుంచి సపోర్ట్ దొరికింది. స్మాల్‌‌ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌‌లు పాజిటివ్‌‌గా ముగిశాయి’ అని ఎల్‌‌కేపీ సెక్యూరిటీస్‌‌, రీసెర్చ్‌‌ హెడ్‌‌ ఎస్‌‌ రంగనాథన్  అన్నారు. బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్‌‌ మూడ్‌‌ మారిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. నిర్ధిష్టమైన షేర్లపై ఫోకస్‌‌ పెట్టాలని సలహాయిచ్చారు. ఇండెక్స్‌‌లు మరింత పెరిగేందుకు రెడీ అవుతున్నాయని  దీన్‌‌ దయాల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ టెక్నికల్ ఎనలిస్ట్‌‌ మనిష్‌‌ హాతిరమాని అన్నారు. ఊహించినట్టుగానే నిఫ్టీ 17,600 లెవెల్‌‌ను చేరుకుందని చెప్పారు. నిఫ్టీకి 17,850 వద్ద రెసిస్టెన్స్ ఉందని, ఇది కూడా దాటితే నెక్స్ట్‌‌ టార్గెట్‌‌18,050 అని అంచనావేశారు. మార్కెట్ పడితే కొనుగోలు చేయాలని సలహాయిచ్చారు.

‘బ్లూచిప్‌‌ షేర్లలో స్ట్రాంగ్ బయ్యింగ్ కనిపించింది. డిసెంబర్‌‌‌‌ జీఎస్‌‌టీ కలెక్షన్‌‌ 13 శాతం పెరగడం వంటి అంశాలు సెంటిమెంట్‌‌ను పెంచాయి. కానీ, కిందటి నెలలో  ఇండియా మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీ స్వల్పంగా తగ్గిన విషయాన్ని ట్రేడర్లు పట్టించుకోలేదు’ అని ఆనంద్ రాఠి షేర్స్ అండ్‌‌ స్టాక్‌‌ బ్రోకర్స్‌‌ ఎనలిస్ట్‌‌ నరేంద్ర సోలంకి పేర్కొన్నారు. ‘ఐటీ ఈ ఏడాది కూడా టాప్‌‌ పెర్ఫార్మర్‌‌‌‌గా కొనసాగుతుంది. 2021 లో పెద్దగా పెరగని ప్రైవేట్ బ్యాంకులు ఈ ఏడాది  పెరుగుతాయి. క్రెడిట్‌‌ డిమాండ్‌‌ పెరగడంతో పాటు, ఎన్‌‌పీఏలు తగ్గడం, మార్జిన్లు పెరగడం వంటి కారణాలు దీనికి సపోర్ట్ చేస్తాయి’ అని జియోజిత్ ఎనలిస్ట్‌‌ విజయకుమార్‌‌‌‌ పేర్కొన్నారు. హాంకాంగ్‌‌ మార్కెట్‌‌ డౌన్ అవ్వగా, సౌత్‌‌కొరియా మార్కెట్ పాజిటివ్‌‌గా క్లోజయ్యింది. డాలర్ మారకంలో రూపాయి 74.26 వద్ద  సెటిలయ్యింది.