
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ లో ఆదివారం ముత్యాలమ్మ జాతర ఘనంగా జరిగింది. స్థానికుల ఇండ్లకు బంధుమిత్రుల రాకతో పట్టణ ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని, బోనాలు, ముడుపులు, కానుకలు చెల్లించుకున్నారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలు ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై ప్రభలను కట్టి, అమ్మవారి దర్శనానికి వెళ్లారు. మున్సిపాలిటీవారు పచ్చదనం సందేశాన్నిచ్చే ప్రభలను ప్రదర్శించడం ఆకట్టుకుంది.
అమ్మవారి సేవలో మంత్రి ఉత్తమ్..
ముత్యాలమ్మను రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.