యాదగిరిగుట్ట, వెలుగు: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి 'ఊంజల్ సేవ'ను అర్చకులు ఉత్సవంలా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు ముగిసిన అనంతరం.. సాయంత్రం ప్రధానాలయ మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవను చేపట్టారు.
అద్దాల మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవ చేపట్టి ఆలయ మాడవీధుల్లో ఊరేగించాల్సి ఉండగా.. వర్షం కారణంగా ప్రధానాలయ మంటపంలో నిర్వహించారు. రకరకాల పూలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో ఆండాళ్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలతో ఊంజల్ సేవను నిర్వహించి శయనింపజేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణీకుల వేదపారాయణాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు.
