
మంచిర్యాల, వెలుగు : ఓ వృద్ధురాలితో పాటు ఆమె మనుమరాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్‌వాడ ఎ క్యాబిన్ ఏరియాలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాలకు చెందిన బెజ్జం గంగోత్రి తన తల్లిదండ్రులతో కలిసి ఖమ్మం జిల్లాలో ఉంటూ చిరు వ్యాపారం చేసుకుంటుండగా... భార్య, ఇద్దరు కూతుళ్లు పాల్వంచలో ఉంటున్నారు.
మంచిర్యాలలోని ఇంటిని అమ్మేందుకు గంగోత్రి ఇటీవల తన తల్లి సరస్వతి (60), పెద్ద కూతురు శిరీష (6)తో కలిసి వచ్చాడు. తల్లి, కూతురిని మంచిర్యాలలోనే ఉంచి సోమవారం సాయంత్రం ఖమ్మం వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం తల్లి సరస్వతికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.
దీంతో పక్కింటి వారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు వెళ్లి చూసే సరికి లోపల గడిపెట్టి ఉండగా.. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో 100 కాల్ చేసి విషయం చెప్పారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా సరస్వతి, శిరీష అప్పటికే చనిపోయి కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై విచారణ చేస్తున్నామని సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.