త్యాగాల పండుగ బక్రీద్..

త్యాగాల పండుగ బక్రీద్..

ముస్లింలు భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో చేసుకునే ముఖ్యమైన పండుగ బక్రీద్. తనను తాను అర్పించుకునేంత త్యాగానికి ప్రతీక. ఇష్టమైనవి త్యాగం చేసి అల్లాహ్​ను ప్రసన్నం చేసుకునే పండుగ ఇది.

అల్లాహ్ తన ప్రవక్తలను అప్పుడప్పుడు పరీక్షించేవాడు. అదేవిధంగా ప్రవక్త హజరత్ ఇబ్రహీం, ఆయన భార్య బీబీ హజ్రాలను కూడా పరీక్షించాడు. వాళ్లకు వృద్ధాప్యంలో సంతాన ప్రాప్తి కలిగింది. లేక లేక పుట్టిన కొడుకు ఇస్మాయిల్​ను ఇద్దరూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అదే సమయంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కొడుకు ఇస్మాయిల్​ను అల్లాహ్​ కోసం ఖుర్బానీ (బలిదానం) చేస్తున్నట్లు కలగంటాడు. ఆ కల ద్వారా అల్లాహ్​ తన కొడుకుని ఖుర్బానీ కోరుకుంటున్నాడని ఇబ్రహీంకి అర్థం అవుతుంది. దాంతో అతన్ని బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడతాడు.

ఆ విషయాన్ని కొడుకుతో చెప్పకముందే తండ్రి మనసులో ఉన్న విషయాన్ని ఇస్మాయిల్​ గుర్తిస్తాడు. అతను కూడా సంతోషంగా తనను తాను బలి కావడానికి సిద్ధపడ్డాడు. తన మీద ఉన్న ప్రేమతో బలిచ్చే సమయంలో తన తండ్రి వెనకడుగు వేస్తాడేమోనని  ఇస్మాయిల్​ అనుమానిస్తాడు. అలా జరిగితే.. అల్లాహ్ ‌ ముందు తన తండ్రి విశ్వాసఘాతకుడిగా నిలవాల్సి వస్తుంది. అందుకే కళ్లకు ఒక బట్ట కట్టుకొని తనను బలి ఇవ్వాలని తండ్రికి సలహా ఇస్తాడు. దాంతో ఆ తండ్రి అలాగే చేస్తాడు.

అల్లాహ్ నామస్మరణ చేస్తూ.. కొడుకుని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెడతాడు. అప్పుడు ఇబ్రహీం త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ఆఖరి క్షణంలో ఇస్మాయిల్​ని తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ఉండేలా చేస్తాడు. దాంతో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్ మార్గంలో అది ఖుర్బానీ అవుతుంది. ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆ రోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండుగ రోజు ఖుర్బానీ జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని  ప్రళయం వరకు కొనసాగించాలని సూచించినట్లు ఇస్లాం చెప్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నేటికీ బక్రీద్ పండుగ జరుపుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంటారు. త్యాగానికి గుర్తుగా మేకలు, పొట్టేళ్లను ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

‘‘ఖుర్బానీ కోసం జంతువులను బలివ్వాల్సి వచ్చే సందర్భంలో త్యాగం విలువ తెలుస్తుంది. ఇది భవిష్యత్ జీవితానికీ మార్గదర్శనం చేస్తుంది” అనేది ముస్లింల నమ్మకం. అందుకే శతాబ్దాలుగా బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకున్న తర్వాత ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ అంటే ‘త్యాగం’, ‘అల్లాహ్​కు సమర్పించడం’ అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఖుర్బానీ ద్వారా భక్తి,  త్యాగం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని నమ్ముతారు. ఖుర్బానీ ఇచ్చే జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తమ కుటుంబం కోసం ఉంచుకుంటారు. 

హజ్​లో ఏం చేస్తారు?

ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన ఐదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. ‘కల్మ, రోజా, నమాజ్, జకాత్’ అనేవి మిగతా నాలుగు బాధ్యతలు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేని ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్​ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం. అల్లాహ్​ ఆదేశాల మేరకు ఇబ్రహీం హజ్ కోసం పిలుపునిచ్చారని ఇస్లాం చెప్తోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి సుమారు ఏడు వేలకు మంది పైగా హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కాకు  వెళ్తున్నారు.

హజ్ చేసే యాత్రికులు తొలుత సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి  చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులో మక్కాకు వెళ్తారు. మక్కాకు ఎనిమిది కిలోమీటర్ల బయట ఉండే మికత్ నుంచి హజ్ యాత్ర మొదలవుతుంది. మక్కాలోకి వెళ్లే ముందు శరీరాన్ని శుభ్రం చేసుకుని, తెల్లని బట్టలు వేసుకుంటారు. దాన్నే ‘అహ్రాం’ అంటారు. మహిళలు అహ్రాం ధరించాల్సిన అవసరం లేదు. వాళ్లు తెల్లని సంప్రదాయ బట్టలు వేసుకుని, తలకు హిజాబ్ చుట్టుకోవాలి. మక్కాకు చేరుకున్న తర్వాత ముస్లింలు చేసే తొలి పని ఉమ్రా. ఇదొక ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఏడాదిలో ఎప్పుడైనా చేయొచ్చు. తప్పనిసరి కాకపోయినా హజ్​లో భాగంగా ముస్లింలు ఉమ్రా చేస్తుంటారు. కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి ఉమ్రాలో భాగంగా ఉంటాయి. 

ఇస్లామిక్ నెల జిల్-హిజ్ 8వ రోజున హజ్ మొదలవుతుంది. 8న హజ్ చేయడానికి వెళ్లిన వాళ్లు (హజీలు) మీనా పట్టణానికి వెళ్తారు. ఇది మక్కాకు12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హజీలు 8వ రోజు రాత్రి మీనాలోనే  గడుపుతారు. మరుసటి రోజు అంటే 9వ రోజు ఉదయం అరాఫత్ మైదానం చేరుకుంటారు. తాము చేసిన పాపాలను క్షమించమని అరాఫత్ మైదానంలో నిలబడి హజీలు అల్లాను వేడుకుంటారు. 9వ రోజు సాయంత్రానికి ముగ్డలిఫాకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు.10వ రోజు పొద్దున తిరిగి మీనాకు  చేరుకుంటారు.

సైతాన్​ను రాళ్లతో కొట్టడాన్ని ‘జమారత్’ అంటారు. మీనాలో ఉండే జమ్రా పిల్లర్ల వద్దకు చేరుకుని హజీలు వాటిని రాళ్లతో కొడతారు. అక్కడే మేక లేదా గొర్రెను ఖుర్బానీ ఇస్తారు. ఆ తరువాత మగవాళ్లు గుండు చేయించుకుంటారు. ఆడవాళ్లు కొంత జుట్టును సమర్పిస్తారు. జమారత్ తరువాత తిరిగి హజీలు మక్కాకు వస్తారు. కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే ‘తవాఫ్’ అంటారు. జిల్-హిజ్10 వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు ఈదుల్ అజహా (బక్రీద్) జరుపుకుంటారు. తరువాత యాత్రికులు మళ్లీ మీనాకు వెళ్లి అక్కడ రెండు రోజులు ఉంటారు. జిల్-హిజ్12వ రోజున చివర సారి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రార్థిస్తారు.

మొహమ్మద్ షౌకత్ అలీ 

ధర్మ సంపాదనతోనే వెళ్లాలి
ముస్లింలు హజ్ యాత్రకు  వెళ్ళాలనుకుంటే మొదట దీక్ష తీసుకోవాలి. తమ సంకల్పాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. సంకల్పంలో ఎలాంటి దుర్బుద్ధి, దురుద్దేశం, కీర్తి ప్రతిష్ఠల కాంక్ష ఉండకూడదు. హజ్ యాత్రకు ఉపయోగించే డబ్బు పూర్తిగా ధర్మ సంపాదన అయి ఉండాలి. వడ్డీ, జూదం, లాటరీ, లంచం, దొంగతనం.. ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో హజ్ యాత్ర చేయడం మహా నేరం.

ఈర్ష్య, ద్వేషాలను వదిలేయాలి

ఈద్ ఉల్ అజహ్​ (బక్రీద్ ) రోజున దైవ మార్గంలో జంతువుల ఖుర్బానీ (బలి దానం) ఇవ్వటంతో ఖుర్బానీ ప్రక్రియ పూర్తిగా అయిపోదు. నిజానికి ఒక వ్యక్తి చెయ్యవలసిన ఖుర్బానీలు (త్యాగాలు) దివ్య ఖురాన్​లో ఇలా ఉన్నాయి. అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చెయ్యటం.. అంటే మనిషి అమితంగా ప్రేమించే ధనాన్ని త్యాగం చెయ్యగలగాలి. అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాలను,  ప్రేమించే వస్తువులను త్యాగం చెయ్యగలగాలి.

వదులుకోలేని  బలహీనతలను బలి ఇవ్వాలి. ఇలా మనిషి అమితంగా ప్రేమించే వాటిని త్యాగం చెయ్యటంతో పాటు మనిషికి ఇతరుల పట్ల ఉండే ఈర్ష్యా - ద్వేషాలను బలి ఇవ్వాలి. చెడు కోరికలను, చెడు ఆలోచనలను  బలి ఇవ్వాలి. ఈ రకమైన త్యాగనిరతిని వ్యక్తిత్వంలో కలిగి ఉన్నప్పుడే ఖుర్బానీ ఇవ్వటం అన్న ప్రక్రియకు సార్థకత చేకూరుతుంది.


ముఫ్తీ మోయీజ్ షాంజీ మెట్​పల్లి, వెలుగు